జగనన్న చేదోడు ప్రారంభం
సొంత దుకాణాలున్న రజకులు, నాయీ బ్రహ్మణులు, దర్జీలకు రూ.10 వేల సాయం అందించే జగనన్న చేదోడు పథకాన్ని ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆన్లైన్ ద్వారా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా 2,47,040 మంది లబ్ధిదారుల ఖాతాలో రూ.10 వేల చొప్పున రూ.247.04 కోట్లు జమకానున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ అర్హత ఉండి లబ్ధి చేకూరకపోతే ఎవరూ కంగారు పడొద్దని సూచించారు. జాబితాలో పేరులేనివారు, అర్హులైన వారు ఇంకా ఉంటే వార్డు, గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. అర్హులందరికీ ఎలా సాయం అందించాలన్నదే తమ ఆలోచన అని వివరించారు. కులాలు, మతాలు, పార్టీలు చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
పథకాలు వర్తింపజేయడంలో ఎక్కడా వివక్ష ఉండదని, అదే తమ ప్రభుత్వ విధానమని ముఖ్యమంత్రి సృష్టం చేశారు. పాదయాత్రలో ఇచ్చిన ప్రతీ హామీ నెరవేర్చామని తెలిపారు. ఏడాది పాలనలో అమ్మ ఒడి, రైతుభరోసా, ఫించను కానుక, సున్నా వడ్డీ పథకం, విద్యా దీవెన, వసతి దీవెన, వాహనమిత్ర, మత్స్యకార భరోసా, నేతన్న నేస్తం, జగనన్న చేదోడు లాంటి వివిధ సంక్షేమ పథకాల ద్వారా 42,465 కోట్ల రూపాయలు.. 3.58 కోట్ల లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు.













