ఇంద్రకీలాద్రికి కొత్త సొగసులు
ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
ఆంధ్రప్రదేశ్‌లోని ఇంద్రకీలాద్రికి కొత్త సొగసులు అద్దే పనులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దుర్గగుడి మాస్టర్ ప్లాన్ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేయడంతో పాటు పూర్తయిన వాటికి ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరించారు. విజయవాడ కనకదుర్గానగర్ గోశాల వద్ద రూ.216.05 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మరో రూ.23.145 కోట్లతో పూర్తి చేసిన పనులను ప్రారంభించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ పనులకు సీఎం జగన్ తొలుత శాస్త్రోక్తంగా భూమి పూజ చేశారు. అమ్మవారి విశేషాలతో దుర్గామల్లేశ్వర దేవస్థానం ప్రచురించిన ‘శ్రీకనకదుర్గా వైభవం `ఉపాసనా విధానం’ పరిశోధనాత్మక గ్రంథాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వేద పాఠశాల విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటించారు. అనంతరం ఇంద్రకీలాద్రిపైకి చేరుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. దుర్గగుడి మాస్టర్ ప్లాన్‌ను పరిశీలించారు. మాస్టర్ ప్లాన్ వివరాలను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ ముఖ్యమంత్రికి తెలియచేశారు. రూ.70 కోట్ల ప్రభుత్వ నిధులు, 131 కోట్ల ఆలయ నిధులు, 5 కోట్ల దాతల నిధులు, 33 కోట్ల ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ప్రసాదం పోటు, అన్నప్రసాద భవనం, ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్, కేశఖండన శాలను నిర్మించారు. దుర్గగుడి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయ పున నిర్మాణం, ఇంద్రకీలాద్రి పై కొండ రక్షణ చర్యపనులు, ఎల్టీ ప్యానల్ బోర్డులు, ఎనర్జీ వాటర్ మేనేజ్ మెంట్, స్కాడా ఏర్పాటు వంటివి ఇందులో ఉన్నాయి. 2016 పుష్కరాల సమయంలో కూల్చివేసిన ఆలయాలను పునర్నిర్మాణం చేస్తున్నారు.
మెగా సోలార్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు, కొండ దిగువున బొడ్డురాయి నిర్మాణం, కొండ దిగువున తొలిమెట్టు వద్ద ఆంజనేయ స్వామి, వినాయక స్వామి వార్ల ఆలయ నిర్మాణం కూడా ఈ మాస్టర్ ప్లాన్‌లో ఉన్నాయి. అమ్మవారి అన్న ప్రసాద భవన నిర్మాణం, అమ్మవారి ప్రసాదం పోటు భవన నిర్మాణం, కనకదుర్గ నగర్ నుంచి మహామండపం వరకు ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ నిర్మాణం కూడా భక్తుల సౌకర్యార్థం చేపట్టారు. రాజగోపురం ముందు భాగాన మెట్ల నిర్మాణం.. అలాగే, మహామండపం వద్ద అదనపు క్యూలైన్లను ఏర్పాటు చేస్తున్నారు. కనక దుర్గ నగర్ వద్ద మహారాజద్వారం నిర్మాణం, కనకదుర్గ నగర్ నుండి మహామండపం వరకు రాజమార్గము అభివృద్ధి, కొండపైన పూజా మండపాల నిర్మాణం వంటిని చేశారు. మల్లికార్జున మహామండపం క్యూ కాంప్లెక్స్ మార్పునకు, నూతన కేశఖండన శాల నిర్మాణానికి గోశాల అభివృద్ధికి, యాగశాల నిర్మాణం వంటి వాటికి కూడా నిధులు కేటాయించి పనులను ప్రారంభించారు. కనకదుర్గ నగర్లో మల్టీ లెవల్ కార్ పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నారు.
ముఖ్యమంత్రి రాక సందర్భంగా గోశాల శంకుస్థాపన ప్రాంతం వరకు వివిధ కళాబృందాలు తమ ప్రదర్శనలతో ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికాయి. కేరళ సంప్రదాయ డ్రమ్స్ బృందం, తెలంగాణ కొత్తగూడెం గిరిజనుల కొమ్ము కోయ నృత్యం, భద్రాచలం ఒగ్గుడోలు, గిరిజన గుస్సాడి (నెమలి నృత్యం) కోలాటం, కూచిపూడి నృత్య బృందాల ప్రదర్శనలు అలరించాయి.
ఆలయం వద్ద పూర్ణకుంభంతో స్వాగతం
కనక దుర్గమ్మను దర్శించుకున్న ముఖ్యమంత్రి జగన్‌కు పెద రాజగోపురం వద్ద పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారి అంతరాలయంలో ప్రత్యేక పూజల అనంతరం వేద పండితులు ఆశీర్వ చనం అందించారు. ముఖ్యమంత్రికి తీర్థ ప్రసాదాలు, అమ్మవారి చిత్ర పటాన్ని దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, దుర్గగుడి చైర్మెన్ కర్నాటి రాంబాబు, కమిషనర్ ఎస్.సత్యనారాయణ, ఈవో కెఎస్.రామారావు, వేద పండితులు అందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి తానేటి వనిత, శాసన మండలి సభ్యులు తలశిల రఘరామ్, రుహుల్లా, అరుణ్‌కుమార్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, తూర్పు నియోజక వర్గ ఇన్చార్జి దేవినేని అవినాష్, జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, డిప్యూటీ మేయర్ అవుతు శైలజారెడ్డి, దేవస్థానం కమిటీ సభ్యులు, దేవదాయశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వలన్, దేవదాయశాఖ కమిషనర్ సత్యనారాయణ, కలెక్టర్ ఢల్లీిరావు, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ టి.కె రాణా, డీసీపీ విశాల్ గున్ని, జాయింట్ కలెక్టర్ సంపత్‌కుమార్, నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, సబ్ కలెక్టర్ అదితిసింగ్, ఆలయ ఈవో కె.ఎస్ రామారావు, ఆలయ స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ, ప్రధాన అర్చకులు ఎల్.డి ప్రసాద్, వైదిక కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ప్రారంభించిన పనులు ఇవీ..
* రూ.5.60 కోట్లతో పునః నిర్మించిన మల్లేశ్వర స్వామి వారి ఆలయం
* రూ.4.25 కోట్లతో పూర్తైన ఇంద్రకీలాద్రి కొండ రక్షణ పనులు
* రూ.3.25 కోట్లతో ఎల్టీ ప్యానల్ బోర్డులు, ఎనర్జీ, వాటర్ మేనేజ్మెంట్, స్కాడా పనులు
* 2016 పుష్కరాల సమయంలో గత సర్కారు కూల్చిన ఎనిమిది ఆలయాలను రూ 3.87 కోట్లతో పునః నిర్మించి ప్రారంభించిన సీఎం జగన్.
* పాతపాడు గ్రామంలో దేవస్థానం స్థలంలో రూ.5.66 కోట్లతో 1 మెగావాట్ సోలార్ విద్యుత్ కేంద్రం
* కొండ దిగువన రూ.23 లక్షలతో నిర్మించిన బొడ్డు బొమ్మ, రూ.28 లక్షలతో అమ్మవారి పాత మెట్ల మార్గంలో నిర్మించిన ఆంజనేయ స్వామి, వినాయక ఆలయాలను ప్రారంభించిన సీఎం జగన్.













