ఏపీలో ఇకపై రెండు రకాల పాఠశాలలు… నిర్ణయం తీసుకున్న సీఎం

ఇకపై ఏపీలో రెండు రకాల స్కూళ్లు అందుబాటులోకి రాబోతున్నాయి. ఒకటి పీపీ1 కాగా రెండోది పీపీ2 స్కూల్. పీపీ1 అంటే ఒకటి, రెండు తరగతులు ఒకటిగానూ ఉంటాయి. ఇలాంటి మోడల్ జాబితాలోకి వచ్చే విద్యార్థులకు తాముండే పరిధి నుంచి ఒక కిలోమీటర్ దూరంలో స్కూల్ ఉంటుంది. పీపీ2 అంటే 3 నుంచి 10 వ తరగతి వరకూ అన్నమాట. వీటిని సమీపంలో ఉండే హైస్కూల్ పరిధిలోకి తీసుకొస్తారు. ఇది కూడా 3 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు. విద్యాశాఖ, అంగన్వాడీల్లో ‘నాడు-నేడు’ అంశంపై సీఎం జగన్ తన క్యాంప్ కార్యాలయంలో ఉన్నత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన విద్యా విధానంపై సీఎం సమీక్షించారు. దీని అమలు కోసం కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. కేవలం రెండేళ్లలోనే దీనికి కావాల్సిన సదుపాయాలను ఏర్పాటు చేసి, ఖర్చుల వివరాలను కూడా పొందుపరచాలని సీఎం ఆదేశించారు. ఉపాధ్యాయుడు, విద్యార్థి ఇద్దరూ సమంగా ఉండాలన్నదే ఈ నూతన విద్యా విధానం లక్ష్యమని వివరించారు. వివిధ పాఠశాలల నుంచి గానీ, అంగన్వాడీ కేంద్రాల నుంచి గానీ ఏ ఒక్క ఉద్యోగిని కూడా తొలగించమని, ఒక్క సెంటర్‌ను కూడా మూసేది లేదని జగన్ విస్పష్టమైన ప్రకటన చేశారు. ఈ రెండు అంశాలను కేంద్రంగా తీసుకొనే, నిర్ణయాలన్నీ తీసుకుంటామని, ఎవరూ దిగులు చెందవద్దని కోరారు.
నూతన విద్యా విధానంపై భరోసా కల్పించండి… ప్రచారం చేయండి… : సీఎం
నూతన విద్యా విధానంతో నాణ్యమైన విద్య, బోధనతో పాటు నాణ్యమైన మౌలిక సదుపాయాలు కూడా వస్తాయని, వీటన్నింటినీ సమకూర్చడమే తమ లక్ష్యమని సీఎం అధికారులకు వివరించారు. ప్రభుత్వం చేస్తున్న పనులన్నీ తలెత్తుకునే పనులేనని, తలదించుకొని చేస్తున్న పనులేవీ కావని స్పష్టం చేశారు. అధికారులందరూ ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగాలని, అంతా మంచే జరుగుతుందని ఉపాధ్యాయులకు తెలియజేయాలని కోరారు. పిల్లలందరికీ ఇంగ్లీషు మీడియం చెప్పాలని చూస్తున్నామని, మంచి విద్య అందించాలన్న అభిమతంతో ముందకు సాగుతున్నామని అన్నారు. ఒకే టీచర్ అన్ని రకాల సబ్జెక్టులను బోధించడం ఎంత మాత్రమూ సమర్థనీయం కాదని ఆక్షేపించారు. చిన్న తనంలో ఉన్న పిల్లలకు మానసిక వికాసం చాలా అవసరమని, అందుకే పిల్లల సంఖ్యకు తగినట్లుగా ఉపాధ్యాయులు కూడా ఉండాలని జగన్ అభిలషించారు.
అంగన్వాడీ ఉద్యోగులను కూడా తొలగించం : ముఖ్యమంత్రి
నూతన విద్యా విధానం వల్ల ఎవ్వరికీ ఇబ్బంది ఉండదని, ఏ ఉద్యోగిని కూడా తొలగించమని సీఎం భరోసా కల్పించారు. అంగన్వాడీ కేంద్రాలు కూడా నాడు-నేడులో భాగమేనని స్పష్టం చేశారు. సాచ్యురేషన్ పద్ధతిలో అంగన్వాడీలు నడవాలని, అంగన్వాడీ సెంటర్లను తగ్గించమని తేల్చి చెప్పారు.