ప్రతి ఇంటి వద్దకూ ఎమ్మెల్యేలు వెళ్ళాలి…ఎమ్మెల్యేలకు సిఎం జగన్ దిశానిర్దేశం
రాష్ట్రంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పాటై మరో రెండు మూడు నెలల్లో మూడేళ్లు పూర్తి కావస్తోంది. ఇక నుంచి పార్టీ పరంగా ప్రజల్లోకి వెళ్లే విధంగా కార్యక్రమాలు చేపట్టాలి. ఆ దిశగా అడుగులు వేయాల్సిన సమయం వచ్చింది. ఎమ్మెల్యేలు అంతా ప్రజల్లోకి వెళ్లాల్సిన బాధ్యత ఉందని, ప్రజలు మన ఇళ్ల దగ్గరికి వచ్చి మనల్ని కలవడం అన్నదానికి ఇకపై స్వస్తి పలికి ఎమ్మెల్యేలంతా గ్రామాల్లోకి వెళ్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు.
మే నుంచి నెలకు 10 సచివాలయాల వద్దకు నెలలో 20 రోజులపాటు గ్రామాల్లో ఎమ్మెల్యేలు తిరగాలి. ఒక్కో గ్రామ సచివాలయానికి రెండు రోజులు వెళ్లాలి. ఆ సచివాలయం పరిధిలో ప్రతి ఇంటివద్దకూ వెళ్లాలి. ఆ కుటుంబానికి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల ఫలాలను వివరించాలి. ఆ ఇంటికి ఏం మేలు చేశామనే అంశంపై నేను రాసిన లేఖను అందించాలి. మీరే స్వయంగా ఆ లేఖను ఇచ్చి ఆ మేలును గుర్తు చేయాలి. వారి ఆశీస్సులను పొందాలి. అప్పుడే మనకు సత్ఫలితాలు లభిస్తాయన్నారు.
రెండున్నర ఏళ్ల తర్వాత మంత్రివర్గాన్ని పూర్తిగా పునర్వ్యవస్థీకరిస్తానని గతంలోనే చెప్పానని.. అందులో భాగంగానే ఇప్పుడు మంత్రుల మార్పుంటుందన్నారు. వైసీపీ అంటేనే.. మీరు, నేను కలిసి నిలబెట్టుకున్న పార్టీ అన్నారు సీఎం జగన్. ఇప్పుడు మంత్రుల మార్పు అంటే.. మంత్రివర్గంలోంచి పక్కనపెడుతున్నట్టు కాదన్నారు సీఎం జగన్. వారికి పార్టీ బాధ్యతలు, జిల్లా అధ్యక్షపదవులు, రీజినల్ కో ఆర్డినేటర్ లుగా బాధ్యతలు అప్పగిస్తున్నామన్నారు. మంత్రులుగా పనిచేసినందున వారికి ప్రతిష్ట పెరుగుతుంది.. అదే సమయంలో పార్టీని నడిపించే శక్తి ఉంటుందన్నారు. మీరు గెలవండి, పార్టీని గెలిపించుకుని రండి.. అని మంత్రులతో చెప్పారు. ఇప్పుడు మంత్రులు పార్టీ బాధ్యతల్లోకి వెళ్తారని.. కొత్త మంత్రులుగా వచ్చేవారు.. మళ్లీ పార్టీ బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుదన్నారు. తప్పుదు అనుకున్న చోట, కొన్ని సామాజిక సమీకరణాల వల్ల రీషఫులింగ్‌లో కొన్ని కొన్ని మినహాయింపు లుంటాయన్నారు. అసెంబ్లీ వాయిదా పడ్డాక కాన్ఫరెన్స్ హాల్లో ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన వైఎస్సార్సీపీ శాసన సభాపక్ష సమావేశం మంగళవారం జరిగింది. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులు అర్పించి సమావేశాన్ని సీఎం ప్రారంభించారు. సమావేశం ప్రారంభంలోనే దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి వైఎస్సార్ఎల్పీ ఘనంగా నివాళులు అర్పించింది. జగన్ మాట్లాడుతూ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు.
ఏప్రిల్‌లో ఉగాది నుంచి వలంటీర్లకు సన్మానాలు చేస్తున్నాం. బాగా పనిచేసిన వలంటీర్లకు సేవావజ్ర, సేవామిత్ర, సేవారత్న అవార్డులు ఇస్తున్నాం. ప్రభుత్వం వైపు నుంచి పారితోషికం, మెడల్ కూడా అందజేస్తున్నాం. గతేడాది కూడా మనం నిర్వహించాం. ఏప్రిల్ 2న ఉగాది నాడు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం నెల రోజులపాటు సాగుతుంది. కచ్చితంగా ప్రతి ఊరికీ వెళ్లి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాల్గొనాలి. రోజూ మూడు నాలుగు గ్రామాలకు వెళ్లి వలంటీర్లను సన్మానించే కార్యక్రమాల్లో పాల్గొనాలి. ఇది చాలా ముఖ్యం.
గ్రామాల్లో మీరు పర్యటించినప్పుడు క్యాడర్‌తో మమేకమవ్వండి. వారిని ప్రజలకు చేరువ చేయండి. మళ్లీ మూలాల్లోకి వెళ్లి బూత్ కమిటీల ఏర్పాటు కూడా జరగాలి. ఈ కమిటీల్లో సగం మంది మహిళలు ఉండాలి. ఈ మూడు పనులు ఏకకాలంలో జరగాలి. ఆ తర్వాత వేరే సచివాలయానికి వెళ్లే ముందు.. ఇక్కడ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా చేపట్టాలి. నెలకు పది సచివాలయాలు మాత్రమే కేటాయించాం. మిగిలిన 10 రోజులు ఇతర కార్యక్రమాలు చేపట్టవచ్చు. ప్రతి నియోజకవర్గంలో దాదాపు 80 సచివాలయాలు ఉంటాయి అనుకుంటే గడప గడపకూ కార్యక్రమం పూర్తి కావడానికి కనీసం 8 నెలలు పడుతుంది. 8 నెలలు పూర్తయ్యే సరికి ప్రతి ఇంటికీ ఎమ్మెల్యే వెళ్లి ఆ కుటుంబాల ఆశీర్వాదాలు తీసుకుంటారు. గడప గడపకూ కార్యక్రమాన్ని సక్రమంగా చేయకపోతే సర్వేల్లో మీ పేర్లు రావు. సర్వేలలో మీ పేరు లేకపోతే మొహమాటం లేకుండా టికెట్లు నిరాకరిస్తా. మనం గెలవాలి.. అది మరిచిపోవద్దు. ఎందుకంటే… జుత్తు ఉంటేనే ముడి వేసుకోవచ్చు.. అదే లేకపోతే.. ఎలా? గెలవదగ్గ పరిస్థితుల్లోకి ప్రతి ఒక్కరూ రావాలి. ఇన్నాళ్లూ కోవిడ్ వల్ల ప్రజలకు కాస్త దూరంగా గడిపి ఉండవచ్చు. ఇప్పుడు ఆ ప్రభావం తగ్గిన నేపథ్యంలో ప్రజల్లోకి వెళ్లాలని జగన్ స్పష్టం చేశారు.













