పవన్, చంద్రబాబుకు ఆ దమ్ముందా?: సీఎం వైఎస్ జగన్ సవాల్
వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు, దత్తపుత్రుడికి 175 స్థానాల్లో పోటీ చేసి గెలిచే ధైర్యముందా? అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సవాల్ విసిరారు. గుంటూరు జిల్లా తెనాలిలో వైఎస్ఆర్ రైతుభరోసా నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ప్రజలకు మంచి చేశాం కాబట్టే మళ్లీ అధికారంలోకి వస్తామనే నమ్మకం తమకు ఉందని అన్నారు. తమది పేదల ప్రభుత్వమని, చంద్రబాబుది పెత్తందారీ పార్టీ అని వ్యాఖ్యానించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాటిలో 98.5 శాతం హామీలను అమలు చేశామని తెలిపారు. అందుకే తమ పార్టీ ఎమ్మెల్యేలు ధైర్యంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో తిరుగుతున్నారన్నారు.
వచ్చే ఎన్నికల్లో కరవుతో ఫ్రెండ్షిప్ ఉన్న చంద్రబాబు, వరుణ దేవుడి ఆశీస్సులున్న మనందరి ప్రభుత్వానికి మధ్య యుద్ధం జరగనుంది. ఆ యుద్ధం కులాల మధ్యకాదు, పేదలు, పెత్తందార్ల మధ్య. పొరపాటు జరిగితే రాజకీయాల్లో ఇచ్చిన మాటపై నిలబటం అనేదానికి అర్థమే లేకుండా పోతుంది. మాట ఇచ్చి దాన్ని నిలబెట్టుకోలేకపోతే ఆ వ్యక్తి రాజకీయాల్లో కొనసాగేందుకు అర్హుడు కాదు అనే పరిస్థితి రావాలి. అందుకే ఇచ్చిన హామీలో 98.5 శాతం అమలు చేశామని గర్వంగా చెబుతున్నాం. మంచి జరిగిందని అనిపిస్తే తోడుగా ఉండాలని మాత్రమే కోరుతున్నా. అన్నీ గమనించి నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించండి. మీ ఇంట్లో మంచి జరిగిందా? లేదా? అనేది ప్రామాణికంగా తీసుకోండి అని కోరారు.













