కోటి ప్రకటనతో… నోటి మాట నో…
కలా నిజమా? మేం కంటున్నది కలేమో…వింటున్నది అబద్ధమేమో అన్నట్టుగా గిల్లి చూసుకున్నారు. ఏం జరుగుతుందో అర్ధం కాక నోట మాట కూడా రాక చేష్టలుడిగిపోయారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ పట్టణంలో సంభవించిన అనుకోని విపత్తు ధాటికి సామాన్య ప్రజలు తల్లడిల్లిపోయారు కాబట్టి ఈ వర్ణన వారిని ఉద్ధేశ్యించి అనుకుంటే పొరబడినట్టే. విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ సమీప గ్రామాల ప్రజలకు ఏ మాత్రం తీసిపోని విధంగా మారింది ఎపిలో విపక్షాల పరిస్థితి.
దీనికి కారణం ఈ విపత్తు పట్ల రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన తీరు. ఈ దుర్ఘటన సంభవించిన వెంటనే అధికార యంత్రాంగం చురుకుగా కదిలింది. అపార ప్రాణ నష్టం జరుగకుండా చేయగలిగింది. ఇదంతా ఒకెత్తయితే ఆఘమేఘాల మీద విశాఖ చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాధితులను పరామార్శించిన వైనం, వారిక భరోసా ఇచ్చిన తీరు, పరిహారంగా ప్రకటించిన భారీ మొత్తాలు వెరసి ఎపిలో విపక్షాలకు నోటి మాట పడిపోయేలా చేశాయ్.
ఇదేమీ అతిశయోక్తిగా చెప్పుకోవడం కాదు. భారతదేశ చరిత్రలోనే కనివిని ఎరుగని విధంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమ కాలుష్యపు కాటుకి బలైన వారికి పరిహారంగా ఏకంగా రూ.కోటి రూపాయలను ప్రకటించడం సంచలనంగా మారింది. విశాఖలో విషవాయువు లీకేజీ సంఘటన జరిగిన వెంటనే భాజాపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పందించి రూ.25లక్షలు పరిహారంగా డిమాండ్ చేశారు. మరొక పార్టీ రూ.50లక్షలు డిమాండ్ చేసింది. అయితే వీటన్నింటినీ తోసిరాజంటూ ఏకంగా రూ. కోటి రూపాయలను ప్రభుత్వం ఇస్తాననడంతో ఇక విపక్షాలకు నోరు పెగల్లేదు. మాటలు మిగల్లేదు. కోటితో పాటు జగన్ ప్రకటించిన పలు రకాల పరిహారాలు కూడా ఊహించనంత స్థాయిలోనే ఉన్నాయి. దీంతో విపక్షాలను విశాఖ విషవాయువును మించినదేదో ఆవరించింది.
అందుకే చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా విపక్షాలు అధికార పక్షాన్ని పొగడక తప్పలేదు. ఈ పొగడ్తలకు విశాఖకు చెందిన తేదేపా ఎమ్మెల్యే గణబాబు తెరతీశారు. సంఘటన జరిగిన వెంటనే అధికార యంత్రాంగం స్పందించిన తీరును ఆయన కొనియాడారు. ఆ తర్వాత భాజాపా నేత విష్ణు కుమార్ రాజు కూడా జగన్ నిర్ణయాన్ని అభినందించారు. ఊహించనంత, భవిష్యత్తులో ఎవరూ చేయరేమో అనేంత సాహసాన్ని జగన్ చేశారని ఆయన కొనియాడారు. ఇక తాము మాట్లాడడానికి ఏముంది అన్నట్లు ఆయన తేల్చేశారు. ఇటీవల ప్రభుత్వం మీద చీటికీ మాటికీ విరుచుకుపడుతున్న భాజాపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు సైతం జగన్ నిర్ణయాన్ని పొగడక తప్పలేదు. రూ.కోటి పరిహారం అనూహ్యమని, ఏదేమైనా జగన్ నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని ఆయన అన్నారు. మరో భాజాపా నేత జివీఎల్… విశాఖ ఘటన అనంతరం ప్రభుత్వం స్పందించిన తీరు అద్భుతం అంటూ కొనియాడారు. సినిమా రంగం నుంచి దర్శకుడు పూరి జగన్నా«ద్ కూడా జగన్ ప్రభుత్వ పనితీరుపై ప్రశంసలు కురిపించారు. మొత్తం మీద విశాఖ విపత్తు అక్కడి ప్రజలను ఒక రకంగా అచేతనులుగా మారిస్తే విపక్షాలను మరో రకంగా అచేతనులుగా చేసింది.













