వారి కాళ్లమీద వారు నిలబడడానికే … జగనన్న తోడు
చిరు వ్యాపారులకు తోడుగా నిలబడాలి, మంచి చేయాలనే ఆలోచన నుంచే జగనన్న తోడు పథకం తీసుకొచ్చినట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. జగనన్న తోడు పథకం కింత మూడో విడత సాయంగా లబ్ధిదాల ఖాతాల్లో నగదు జమ చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిధుల విడుదల అనంతరం మాట్లాడారు. సొంతంగా ఉపాధి కల్పించుకోవడం గొప్ప విషయమన్నారు. నామమాత్రపు లాభాలకు సేవలు అందించే గొప్ప వర్గం చిరు వ్యాపారులదని అన్నారు. తన పాదయాత్రలో చిరు వ్యాపారుల కష్టాలు చూశానని తెలిపారు. వాటి నుంచి వ్యాపారులు బయటపడటానికి సాయం అందించాలనే నిర్ణయంతో పథకం తీసుకొచ్చామన్నారు. క్రమం తప్పకుండా రుణాలు చెల్లిస్తే మళ్లీ రుణాలు అందుతాయని తెలిపారు.
చిరు వ్యాపారుల రుణాలకు ప్రభుత్వ పూచీకత్తుగా ఉంటోందన్నారు. ఇప్పటి వరకు 14 లక్షల మంది చిరు వ్యాపారులకు రుణాలు అందజేసినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 5.10 లక్షల మంది చిరు వ్యాపారుల ఖాతాల్లో రూ.510.46 కోట్ల రుణాలను జమ చేసినట్లు తెలిపారు. రూ.16.16 కోట్ల వడ్డీ రీయింబర్స్మెంట్ కలిపి 526.62 కోట్లు జమ చేశామన్నారు. ఈ పథకంలో భాగంగా చిరు వ్యాపారులు, హస్త కళకారులు, చేతి వృత్తుల వారికి ఏటా రూ.10 వేల వడ్డీ లేని రుణాన్ని ప్రభుత్వం అందిస్తున్న విషయం తెలిసిందే.












