నవనిర్మాణ దీక్ష, మహా సంకల్పం కార్యక్రమాలు విజయవంతం చేయాలి
జూన్ 2న నవనిర్మాణ దీక్ష, జూన్ 8న మహాసంకల్పం, వాటి మధ్య 5 రోజుల్లో జరిగే అన్నిదీక్షలను విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కోరారు. బుధవారం తన నివాసం నుంచి టెలికాన్పరెన్స్ లో మంత్రులు, జిల్లాల కలెక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులతో మాట్లాడారు. ప్రతిజిల్లాలో , నియోజకవర్గంలో జరిగే సభలను తాను స్వయంగా పరిశీలిస్తానని, విశ్లేషిస్తానని చెప్పారు. ప్రభుత్వ పథకాల్లో తాము పొందిన ఫలితాల గురించి లబ్ధిదారులతో దీక్షా సభల్లో మాట్లాడించాలని, అది ఇతరులకు స్ఫూర్తిదాయకం అవుతుందని అన్నారు.
2014లో ఎక్కడ ఉన్నాం, ఇప్పుడెక్కడ ఉన్నాం, మూడేళ్లలో ఏంచేశాం, ఇంకా ఏం చేయాలి అన్నింటినీ ఈ సభల్లో విశ్లేషించాలన్నారు. నియోజకవర్గ స్థాయిలో, జిల్లాస్థాయిలో జరిగే చర్చాగోష్టులలో అందరూ పాల్గొనాలన్నారు. రాష్ట్ర స్థాయిలో జరిగే సభల్లో ప్రతి రోజూ తాను పాల్గొంటానని తెలిపారు. మూడేళ్ల ప్రగతిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇది మంచి అవకాశంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు,అధికారులు అందరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజల్లోకి ప్రభుత్వ సందేశాన్ని బలంగా తీసుకెళ్లాలని కోరారు.
గత ఏడాది ‘అందరికీ విద్యుత్(పవర్ ఫర్ ఆల్)’ సంకల్పం సాధించామని గుర్తుచేశారు. రాష్ట్రంలో అన్ని గృహాలకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చామన్నారు. ఈ ఏడాది ‘అందరికీ వంటగ్యాస్’ సంకల్పం నెరవేర్చామన్నారు. కిరోసిన్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను చేయగలగడం గొప్ప విషయం అన్నారు. 100% వంటగ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం ద్వారా ఆంధ్రప్రదేశ్ దేశానికే మార్గదర్శకం అయ్యిందన్నారు. వచ్చే ఏడాది మరో సంకల్పం నెరవేరుస్తామన్నారు. ఏడాదికో సంకల్పాన్ని సాకారం చేస్తున్నామంటూ, 2022నాటికి 3వ అగ్రగామిగా మనరాష్ట్రం రూపొందాలన్నారు. 2029నాటికి దేశంలో అగ్రగామి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ కావాలన్నదే మహా సంకల్పమన్నారు. 2050 నాటికి ప్రపంచంలో అత్యుత్తమ రాష్ట్రం కావాలన్నారు. మెరుగైన జీవన ప్రమాణాలు మనందరి బాధ్యత అంటూ రాష్ట్ర భవిష్యత్తు మనందరి చేతుల్లో ఉందన్నారు.
సంఘీభావం,సమష్టితత్వం, సమన్వయం పెంచేందుకే సంకల్పదీక్షలు చేస్తున్నామన్నారు. ఆర్ధికలోటు అధిగమించేందుకు అవిశ్రాంతంగా పనిచేస్తున్నామని, అయినా విభజన కష్టాలు అధిగమించడం చాలా కఠినంగా ఉందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో మనలో స్ఫూర్తిని నింపేందుకే నవనిర్మాణ దీక్ష చేపట్టినట్లు గుర్తుచేశారు. గొప్ప భవిష్యత్తు వైపు మనలను నడిపించేందుకే మహాసంకల్ప దీక్ష చేపట్టామన్నారు. సమాజం ఒక్కటే, ప్రభుత్వం ఒక్కటే, లక్ష్యాలు ఒక్కటే, అదే విధంగా అన్నిశాఖలు ఒక్కటిగా సమష్టిగా, సమన్వయంగా పనిచేయాలన్నారు.
జూన్ 3న విభజన చట్టం, హామీల అమలు, మూడేళ్లలో ఏం సాధించాం, ఇంకా ఏమి సాధించాలన్న దానిపై సమీక్ష, 4వతేదీన వ్యవసాయం అనుబంధ రంగాలు, జలసంరక్షణ, నీరు-ప్రగతి, నదుల అనుసంధానం, భూగర్భ జలాల పెంపు, పంటకుంటలు, రుణ ఉపశమనం, సుస్థిర అభివృద్ది వ్యూహం, 5న సంక్షేమం, సమ్మిళిత అభివృద్ధి, 6న మానవ వనరుల అభివృద్ధి, విద్య, వైద్యం, నైపుణ్యాభివృద్ది, పెట్టుబడుల ఆకర్షణ,ఉద్యోగ కల్పన, 7వతేదీన ప్రజలే ముందు, సమాజ వికాసం, కుటుంబ వికాసం, పారదర్శక జవాబుదారీ సుపరిపాలన, అవార్డులు, విజయాలపై చర్చాగోష్టులు నిర్వహించాలన్నారు.













