అభివృదికి వేదికగా అంతర్జాతీయ సదస్సు
భవిష్యత్ తరాలకు అమరావతి ప్రత్యేకమైన బహుమతిలాంటిదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అంతర్జాతీయ సదస్సును అమరావతి అభివృద్ధికి వేదికగా మలుచుకోవాలని అధికారులను సూచించారు. విజయవాడ సమీపంలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో ఈ నెల 10 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్న సంతోషనగరాల సదస్సుపై సీఆర్డీఏ అధికారులతో ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అమరావతిని కాలుష్యరహిత నగరంగా రూపొందించాలని, ఇక్కడ కేవలం ఎలక్ట్రానిక్ వాహనాలు మాత్రమే వినియోగించాలని సృష్టం చేశారు. అమరావతి కోసం 34 వేల ఎకరాలు ప్రభుత్వానికి అందజేసిన రైతుల త్యాగాల గురించి సదస్సులో అంతర్జాతీయ ప్రతినిధులకు వివరించాలని, అమరావతి అభివృద్ధికి సూచనలు తీసుకోవాలని ప్రత్యేకంగా సూచించారు. అమరావతి ప్రతినిధులతో చర్చల ద్వారా ఇతర దేశాల్లో అమలు చేస్తున్న అత్యుత్తమ విధానాలను ఆకళింపు చేసుకుని అమరావతిని ఉత్తమ రాజధాని నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని సీఆర్డీఏ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్ తెలిపారు. బ్రిటన్, అమెరికా, స్పెయిన్, ఫిన్లాండ్, కొలంబియా, యూఏఈ, ఇజ్రాయెల్ తదితర 20 దేశాల నంచి ప్రతినిధులు రానున్నారని సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ వెల్లడించారు.













