ఇంటెలిజెన్స్ డీజీని ఈసీ మార్చడం చరిత్రలో లేదు : సీఎం రమేశ్
ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు ఎస్పీలు సహా నిఘావిభాగాధిపతి బదిలీలను సవాలు చేస్తూ న్యాయపోరాటం చేస్తామని టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ తెలిపారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ విషయంపై ఎన్నికల సంఘాన్ని కూడా కలుస్తామని సృష్టం చేశారు. ఎలాంటి ఫిర్యాదులు లేని కడప ఎస్పీ, ఇంటెలిజెన్స్ డీజీని ఎలా బదిలీ చేస్తారని ప్రశ్నించారు. ఇంటెలిజెన్స్ డీజీని ఈసీ మార్చడం చరిత్రలో ఎక్కడా లేదన్నారు. వైకాపా, బీజేపీ, ఒకరి తర్వాత ఒకరు వెళ్లి ఈసీని కలవగానే అధికారులను బదిలీ చేశారని ఆరోపించారు. ఫిర్యాదులు అందితే విచారణ లేకుండా ఎలా బదిలీ చేస్తారని ప్రశ్నించారు. వివేకా కుమార్తె వ్యాఖ్యల్లో కూడా మార్పులు కనిపిస్తున్నాయని, ఆమెపై ఒత్తిడి తేవడంతోనే మరోరకంగా మాట్లాడుతున్నారని అన్నారు. రోజుకు ఒకరంగా సునీత మాట్లాడటమే ఇందుకు నిదర్శనమని అన్నారు. వివేకానందరెడ్డి హత్యా ఘటన నీరుగార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. జగన్కు ఓటేస్తే ఏపీ స్కాం ఆంధ్రా అవుతోందని గతంలో అన్న మోదీ.. ఇప్పుడు ఆయన అక్రమాస్తులు, కేసుల గురించి మాట్లాడడం లేదని విమర్శించారు.













