పర్యావరణానికి ఏపీ ఆదర్శం : చంద్రబాబు
అత్యుత్తమైన పర్యావరణానికి ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల కాలుష్య నియంత్రణా మండలి సంయుక్త ఆధ్వర్యంలో విశాఖ నగర పరిధిలోని మధురవాడలోని వైజాగ్ కన్వెన్షన్స్‌లో పర్యావరణ ప్రాంతీయ సదస్సు ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా ముఖ్యమంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వపరంగా తీసుకుంటున్న చర్యలను వివరించారు. ప్రకృతి ప్రసాదించిన వనరులను పరిరక్షించుకునే అంశంపై ప్రజలను చైతన్య వంతులను చేసేందుకు ఏరువాక, వనం-మనం, జలసిరికి హారతి తదితర కార్యక్రమాలను రాష్ట్ర పండుగలు నిర్వహిస్తూ ప్రకృతిని ఆరాదించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు. ఫలితంగా ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు పడుతున్నాయన్నారు.
స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా బహిరంగ మలవిసర్జన రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్ధేందుకు పలు చర్యలు చేపట్టామన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని మున్సిఫాల్టీలను, 4వేల గ్రామలను బహిరంగ మలవిసర్జన రహితంగా తీర్చిదిద్దామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, పట్టణ గ్రామ ప్రాంతాల్లో ఘనవ్యర్థాల నిర్వహణకు అధిక ప్రాధాన్యత నిస్తున్నామన్నారు. 2029 నాటి 50 శాతం గ్రీన్ కవరేజ్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిర్వహిస్తున్న పాత్ర ప్రశంసనీయమని, 82శాతం కేసులను నిర్ణీత కాలవ్యవధిలోనే పరిష్కరించడం ఇందుకు నిదర్శనమన్నారు.













