సీఎం చంద్రబాబును కలిసిన మృత్యుంజయుడు
గుంటూరు జిల్లా వినుకొండ మండలం ఉమ్మిడివరంలో బోరుబావిలో నుంచి క్షేమంగా బయటపడిన బాలుడుతో పాటు తల్లిదండ్రులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆ బాలుడి పేరిట రూ.2 లక్షలు డిపాజిట్ చేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు సుమారు 10 గంటలపాటు తీవ్రంగా శ్రమించి చిన్నారిని క్షేమంగా రక్షించిన జిల్లా ఎస్పీ, కలెక్టర్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని ముఖ్యమంత్రి అభినందించారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయడం వల్లే బాలుడిని బోరుబావి నుంచి క్షేమంగా బయటకు తేగలిగారని ముఖ్యమంత్రి అన్నారు. ఈ ఘటనపై ఓ నివేదిక తయారుచేసి భóవిష్యత్ సమాచారం కోసం పొందుపరచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో నిరుపయోగంగా ఉన్న బోరుబావులను పూడ్చని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిరుపయోగంగా ఉండి, తెరిచి ఉంచిన బోరు బావులు ఎక్కడైనా ఉంటే సోషల్ మీడియాలో పెట్టడంతో పాటు స్థానిక అధికారులకు కూడా ఫొటోలు పంపాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
గుంటూరు జిల్లాలోని వినుకొండ మండలంలో మంగళవారం సాయంత్రం రెండేళ్ల చంద్రశేఖర్ అనే చిన్నారి బోరు బావిలో పడిపోయిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. అప్రమత్తమైన అధికారులు స్థానికుల సహాయంతో సుమారు పది గంటలపాటు శ్రమించి బాలుడిని సురక్షితంగా బయటకు తీసిన విషయం తెలిసిందే.













