నిర్లక్ష్యం వద్దు..అప్రమత్తత విడవద్దు: కోవిడ్‌పై జగన్
మరికొంత కాలం కోవిడ్‌తో కలిసి జీవించాల్సిన పరిస్థితులు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఈనేపథ్యంలో ఉదాసీనత లేకుండా ఎప్పటికప్పుడు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. స్పందన కార్యక్రమంలో భాగంగా ఆయన మంగళవారం కలెక్టర్లు వివిధ ప్రభుత్వ విభాగాల అధిపతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కరోనా పరిస్థితులపై సమీక్ష జరిపి తగు సూచనలు చేశారు.
అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్–19 పరీక్షలు తప్పనిసరిగా జరగాల్సిందేనని సిఎం ఖచ్చితంగా ఆదేశించారు. అలాగే పిహెచ్‌సిలు, యుహెచ్‌పిలు, ఏరియా ఆసుపత్రులు, టీచింగ్ ఆసుపత్రలు, జిజిహెచ్‌లలో కూడా కోవిడ్ పరీక్షల నిర్వహించాలన్నారు. తమకు కోవిడ్ వచ్చిందేమో అనే సందేహంలో ఉన్నవారు కోవిడ్ పరీక్షల కోసం ఎక్కడికి వెళ్ళాలో అర్ధంకాని పరిస్థితి రాష్ట్రంలో ఉండకూడదని స్పష్టంగా చెప్పారు. కోవిడ్ పరీక్షలు, ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులు, ఆసుత్రుల్లో అడ్మిషన్లు తదితర అన్ని అవసరాలకు అందుబాటులోకి తెచ్చిన 104 కాల్ సెంటర్‌ను నంబర్‌ను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. ఈ కాల్ సెంటర్‌నుంచి జిల్లా కలెక్టర్లకు రిక్వెస్ట్‌లు వస్తే వెంటనే దానిపై స్పందించాలన్నారు. ఆ ఫోన్ కాల్స్‌పై ఎలా రెస్పాండ్ అవుతున్నామనేదే మన పనితీరుకు అద్దం పడుతుందన్నారు. కాల్ సెంటర్‌కు ఫోన్ చేసిన వ్యక్తి పట్ల మనం ఎలా రెస్పాండ్ అవుతున్నామనే విషయాన్ని జిల్లా కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. జిల్లా కలెక్టర్లు, జెసిలు ప్రతిరోజూ 104 కాల్ సెంటర్లకు, జిల్లా కోవిడ్ సెంటర్లకు మాక్ కాల్స్ చేసి, వ్యవస్థలో ఎక్కడైనా ఉదాసీనత వుందేమో తనిఖీ చేయాలన్నారు. ఆర్టిపిసిఆర్, ట్రూనాట్ పరీక్షల్లో నమూనాలు తీసుకున్న 24 గంటల్లోపు, రాపిడ్ పరీక్షలో 30 నిమిషాల్లోగా పరీక్ష ఫలితం అందించే విధంగా చూడాలన్నారు. జిల్లాల్లోని అన్ని ల్యాబ్‌లకు అవసరమైన పరికరాలను అందించడం జరిగిందని కాబట్టి ఎక్కడా కిట్ లు లేవనే సాకుతో పరీక్షలు నిరాకరించకూడదని హెచ్చరించారు. పాజిటీవ్ కేసుల్లో ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లు వున్న వారిని ఖచ్చితంగా హోం క్వారంటైన్లో వుంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. కోవిడ్ నేపథ్యంలో అదనంగా 17వేల మంది వైద్యులు, ఇతర సిబ్బందిని ఆరునెలల కాలానికి కాంట్రాక్ట్ విధానంలో నియమించేందుకు అనుమతించామని, మరో 11 వేల మంది ట్రైనీ నర్స్‌లను తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.
దీనికి సంబంధించి ఇంకా కొన్నిచోట్ల పెండింగ్‌లో ఉన్న నియామకాలు వెంటనే పూర్తి చేయాలన్నారు. మరో వారం రోజుల్లో రెగ్యులర్ పోస్ట్‌ల భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. నియామకం పొందిన అభ్యర్ధులు వెంటనే వారికి నిర్ధేశించిన కోవిడ్ విధుల్లో చేరేలా కలెక్టర్లు, జెసిలు పర్యవేక్షించాలన్నారు. హోం ఐసోలేషన్‌లో వున్న వారందరికీ అవసరమైన మందులతో కూడిన మెడికల్ కిట్లను పంపిణీ చేశామని చెప్పారు. జాయింట్ కలెక్టర్లు ఈ హోం కిట్లలో అన్ని మందులు వున్నాయో లేదో పర్యవేక్షించాలన్నారు. దీనితో పాటు 14 రోజుల పాటు పేషంట్‌కు ఫోన్లో మెడికల్ ఆఫీసర్ అందుబాటులో వుండాలన్నారు.













