నిబంధనలకు విరుద్ధం తెలంగాణ ప్రాజెక్టులు: సిఎం జగన్
తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలు ముదురుతున్నాయి. తాజాగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ లేఖపై స్పందించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాసిన లేఖ దీనికి అద్దం పడుతోంది. దాదాపు 5 పేజీల ఈ లేఖలో ఆంధ్రప్రదేశ్ వాదనను చాలా బలంగా వినిపించే ప్రయత్నం చేశారు జగన్. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కొత్తది కాదని దాన్ని అడ్డుకోవడం వల్ల తమ రాష్ట్రానికి తీవ్ర నష్టం కలుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్జీటీ కేంద్ర పర్యావరణ అటవీ శాఖలు దీనిని కొత్త ప్రాజెక్టుగా పరిగణించడం లేదన్నారు. రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి అజెండా ఖరారు చేశామని సమావేశంపై ఏపీ సరిగా స్పందించలేదనడం సరికాదన్నారు. కృష్ణా జలాల్లో ఏపీ వాటాకు కట్టుబడే నీటిని వినియోగించుకుంటామని స్పష్టం చేశారు. పోతిరెడ్డిపాడు వల్ల నీటి నిల్వ సామర్ధ్యం కూడా పెరగదన్నారు. మరోవైపు అపెక్స్ కౌన్సిల్లో చెప్పిన దానికి విరుద్ధంగా తెలంగాణ ప్రాజెక్టులు కడుతోందని ఆరోపించారు. ఏపీ కయ్యానికి కాలు దువ్వుతోందంటూ మొన్న కెసిఆర్ వ్యాఖ్యలు చేయడంతో పాటు ఇప్పుడు కేంద్ర మంత్రికి జగన్ రాసిన లేఖతో.. తెలుగు రాష్ట్రాల మధ్య కుంపటి రాజుకున్నట్టేనని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.













