పులివెందుల నుంచి జగన్ తప్పుకుంటున్నారా..?
పులివెందుల నియోజకవర్గం వైఎస్ కుటుంబానికి కంచుకోట. దశాబ్దాలుగా అక్కడ వాళ్లే నెగ్గుతూ వస్తున్నారు. 1978లో వైఎస్. రాజశేఖర రెడ్డి ఇక్కడి నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఆయన కుటుంబీకులే ఇక్కడ రాజ్యమేలుతున్నారు. ఆప్పుడు కాంగ్రెస్ పార్టీకి వైఎస్ ఫ్యామిలీ ప్రాతినిధ్యం వహించింది. ఇప్పుడు ఆయన కుమారుడు వైఎస్ జగన్ సొంతంగా వైసీపీ పెట్టుకుని గెలిచారు. అయితే ఈసారి వైఎస్ జగన్ పులివెందుల నుంచి కాకుండా మరో స్థానం నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.
పులివెందుల పేరు వినపడగానే వైఎస్ గుర్తుకొస్తారు. అంతగా ఆ పేరుతో పెనవేసుకుపోయింది. నియోజకవర్గంలో ఆ కుటుంబానికి మంచి ఆదరణ ఉంది. రాష్ట్రరాజకీయాల్లో నేతలు బిజీగా ఉన్నా ఆ కుటుంబాన్ని అక్కడి ప్రజలు గెలిపిస్తూనే వస్తున్నారు. అది కూడా భారీ మెజారిటీతో..! పులివెందుల మెజారిటీతోనే కడప పార్లమెంటు స్థానాన్ని ప్రతిసారి ఆ పార్టీ గెలుచుకుంటూ వస్తోంది. వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ పురుషోత్తమ రెడ్డి, వైఎస్ వివేకానంద రెడ్డి, వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్.. ఇలా ఐదుగురు పులివెందుల నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు.
వైఎస్ జగన్ పులివెందుల నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కంచుకోట కాబట్టి పులివెందులను అన్ని రకాలుగా అభివృద్ధి చేశారు. విద్య, వైద్య రంగాల్లో పులివెందులను హబ్ గా తీర్చిదిద్దారు. పట్టణాన్ని సర్వాంగ సుందరంగా మార్చారు. భవిష్యత్ తరాలు కూడా పులివెందుల ఆదరించేలా పునాదులు వేశారు. దీంతో ఇక్కడ వైఎస్ కుటుంబానికి తిరుగు లేదు. నియోజకవర్గ వ్యాప్తంగా ఈ కుటుంబానికి ప్రాణాలిచ్చే అభిమానులున్నారు.
అయితే ఈసారి జగన్ పులివెందుల నుంచి కాకుండా జమ్మలమడుగు నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం అందుతోంది. పులివెందుల నుంచి తల్లి విజయమ్మను బరిలోకి నిలపాలనుకుంటున్నారట. సోదరి షర్మిల కాంగ్రెస్ లో చేరడంతో ఆమె కూడా పులివెందుల లేదా కడప పార్లమెంటు నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది. చెల్లికి చెక్ పెట్టేందుకు పులివెందుల నుంచి తల్లిని దించాలనుకుంటున్నారట జగన్. తల్లిని పులివెందుల నుంచి పోటీ పెడితే షర్మిల తప్పుకుంటారు. తాను జమ్మలమడుగు నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. కష్టకాలంలో పార్టీని ఆదుకున్న తల్లిని, చెల్లిని అధికారానికి దూరం పెట్టారని జగన్ పై ఇప్పుడు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వీటికి చెక్ పెట్టేందుకు తల్లి విజయమ్మను మళ్లీ తెరపైకి తీసుకువస్తున్నారని సమాచారం. గతంలో వైఎస్ చనిపోయిన తర్వాత విజయమ్మ పులివెందుల నుంచి గెలిచారు. 2014లో విశాఖ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మరి తాజా ఈక్వేషన్ నిజమవుతుందా… లేదంటే ప్రతిపాదనలకే పరిమితం అవుతుందా అనేది చూడాలి.













