మంత్రి అమర్ నాథ్ కు సీఎం జగన్ మరో ఝలక్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో ఝలక్ ఇచ్చారు. విశాఖకు ఈ నెల 22న రానున్న ఉప రాష్ట్రపతి ధన్ఖడ్కు ప్రభుత్వం తరపున స్వాగతం పలికే బాధ్యతల నుంచి ఆయన్ను తప్పించారు. మంత్రిగా అమర్నాథ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత విశాఖకు ప్రముఖులు వచ్చే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వాగతం పలికే బాధ్యతను ఆయనకు అప్పగించారు. ఈసారి ఆ బాధ్యతను ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి బూడి ముత్యాలనాయుడుకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల వైసీపీ అధిష్ఠానం అమర్నాథ్ ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి నియోజకవర్గ బాధ్యునిగా మరొకరిని నియమించింది. ఇంతవరకు ఆయన ఎక్కడి నుంచి పోటీ చేసేది కూడా తేల్చలేదు. ఇప్పుడు ప్రముఖులకు స్వాగతం పలికే బాధ్యత నుంచి తప్పించడం రాజకీయ, అధికార వర్గాల్లో చర్చనీయాంశమైంది.













