వైఎస్ఆర్ యంత్ర సేవా పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్
వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం కింద ట్రాక్టర్లు, కంబైన్డ్ హార్వెస్టర్ల పంపిణీని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. గుంటూరులో నిర్వహించిన కార్యక్రమంలో జెండా ఊపి వాటిని ప్రారంభించిన అనంతరం స్వయంగా ఆయన ట్రాక్టర్ నడిపారు. 5,260 రైతు గ్రూపు బ్యాంకు ఖాతాలకు రూ.1.75 కోట్ల సబ్సిడీని ముఖ్యమంత్రి జమ చేశారు. అనంతరం జగన్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 3,800 ట్రాక్టర్లు, 320 కంబైన్డ్ హార్వెస్టర్లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. 40 శాతం రాయితీతో ట్రాక్టర్లు, యంత్రపరికరాలు అందిస్తున్నామని, రైతులు 10 శాతం చెల్లిస్తే సరిపోతుందని తెలిపారు. మిగతా 50 శాతాన్ని తక్కువ వడ్డీతో బ్యాంకు ద్వారా రుణం ఇప్పిస్తున్నట్లు తెలిపారు. ప్రతి అడుగులోనూ రైతులకు తోడుగా నిలుస్తున్నామని, విత్తనాల సరఫరా నుంచి పంట కొనుగోలు వరకు అండగా ఉంటున్నామని తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయాన్ని మరింత మెరుగుపరిచేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో రూ.2,016 కోట్ల విలువైన పరికరాలు అందిస్తామన్నారు. ఇప్పుడు రైతులు వారికి కావాల్సిన ట్రాక్టర్లను వారే కొనుగోలు చేస్తారు. అవినీతి లేకుండా వ్యవస్థను క్లీన్ చేస్తున్నాం అని పేర్కొన్నారు.













