వాలంటీర్లకు జగన్ బంపరాఫర్ ఇవ్వబోతున్నారా..?
ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అధికార వికేంద్రీకరణ ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించవచ్చని మొదటి నుంచి జగన్ చెప్తూ వచ్చారు. అందుకు తగ్గట్టుగానే గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేశారు. వాటితో పాటు ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ను నియమించారు. స్థానికులనే వాలంటీర్లుగా నియమించడం ద్వారా మరింత పక్కాగా ప్రభుత్వ పథకాలను అమలు చేయవచ్చని ఆలోచించారు. ఇలా దాదాపు రెండున్నర లక్షల మంది వాలంటీర్లు ప్రస్తుతం పని చేస్తున్నారు. వీళ్లు ప్రభుత్వ ఉద్యోగులు కారు. అందుకే వీరికి నెలకు రూ.5వేల భృతి ఇస్తున్నారు ప్రభుత్వ కార్యక్రమాలను తమ పరిధిలోని ఇళ్లకు చేర్చడం వాలంటీర్ల ప్రధాన విధి.
ప్రతి వాలంటీర్ కు ప్రభుత్వం ట్యాబ్ ఇచ్చింది. అందులో ప్రభుత్వ సమాచారమంతా నిక్షిప్తమై ఉంటుంది. ప్రతి ఇంటికీ వెళ్లి వాళ్లకు అందుతున్న పథకాలు, వాళ్ల ఆదాయ వ్యయ వివరాలు.. లాంటివన్నీ సేకరిస్తుంటారు. అంతేకాక ప్రతి నెలా పింఛను ఇవ్వడం, ప్రజలకు ఏదైనా అవసరం ఉంటే గ్రామ సచివాలయం దృష్టికి తీసుకెళ్లడం.. లాంటివి వాలంటీర్ల విధులు. ఇంకోరకంగా చెప్పాలంటే ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులు వాలంటీర్లు. అయితే వాలంటీర్ల నియామకానికి స్థానికతను మాత్రమే ప్రామాణికంగా తీసుకున్నారు. దీంతో వైసీపీ కార్యకర్తలనే వాలంటీర్లుగా తీసుకున్నారనే ఆరోపణలున్నాయి.
ఇటీవల పవన్ కల్యాణ్ వాలంటీర్లపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ఎక్కువ మంది మహిళలు మాయమైపోవడం వెనుక వాలంటీర్ల హస్తం ఉందన్నారు. వాలంటీర్లు సేకరించిన సమాచారం పక్కదారి పడ్తోందని,, వైసీపీ నేతలకు అందుతోందని ఆరోపించారు. ఇది డేటా చౌర్యమేనన్నారు. వాలంటీర్లు ఉద్యోగులు కాకపోవడంతో వారిపై ఎలాంటి చర్యలు తీసుకునేందుకు అవకాశం లేదని.. సమాచారం దుర్వినియోగం చేస్తే దానికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ పై ప్రభుత్వంతో పాటు వాలంటీర్లు కేసు పెట్టారు. ఈ విషయంలో వాలంటీర్లకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది జగన్ ప్రభుత్వం.
వాలంటీర్ల ద్వారా తమ ప్రభుత్వానికి మంచి మార్కులు వస్తున్నాయని భావించిన జగన్.. వాళ్లను మరింత మెరుగ్గా వాడుకోవాలని భావిస్తున్నారు. అలాగే రూ.5వేలు ఇచ్చి చాకిరీ చేయించుకుంటారా అని ప్రశ్నించిన దాన్నీ జగన్ గుర్తు పెట్టుకున్నారు. అందుకే వాళ్ల భృతిని రూ.10వేలకు పెంచాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ ఏడాది డిసెంబర్ నుంచి ఈ పెరిగిన భృతి ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. జగన్ బర్త్ డే కానుకగా దీన్ని ప్రకటించబోతున్నారు. అప్పుడు విపక్షాల నోళ్లు కూడా మాతపడుతాయని వైసీపీ భావిస్తోంది. అంతేకాక వచ్చే ఎన్నికల్లో వాలంటీర్లే తమ పార్టీని గెలిపిస్తారని నమ్ముతోంది.













