ప్రజావేదికలో ఘనంగా ‘‘భగీరథ జయంతి’’ వేడుకలు
ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు భగీరథ చిత్రపటానికి పూలమాలలు వేసి స్ఫూర్తిని చాటారు.
భగీరథ జయంతి(ఏప్రిల్ 22) సందర్భంగా సగర సోదరులు, భవన నిర్మాణ కార్మికులు, అన్నివర్గాల ప్రజలు అందరికీ ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
సీఎం చంద్రబాబు మాట్లాడుతూ,‘‘ భగీరథుడు అంటే పట్టుదలకు మారుపేరు. అనుకున్న కార్యం సిద్ధించేదాకా పట్టువదలని వ్యక్తులను భగీరథుడితో పోలుస్తాం. అసాధ్యమైన పనులను సుసాధ్యం చేయడాన్ని భగీరథ ప్రయత్నంగా చెబుతుంటాం.
భగీరథుడు మనందరికీ ఆరాధ్యుడు. లోక కల్యాణం కోసం ఒంటికాలుపై కఠోర తపస్సు చేసి దివి నుంచి భువికి పవిత్ర గంగాజలాన్ని తీసుకొచ్చిన మహనీయుడు భగీరథుడు.
భగీరథుడికి నివాళిగానే తెలుగుదేశం ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేస్తోంది. 5ఏళ్లలో రూ.70వేల కోట్లు ప్రాజెక్టుల పూర్తి కోసమే ఖర్చు పెట్టాం. 23ప్రాజెక్టులను 5ఏళ్లలో పూర్తి చేయడం ఒక చరిత్ర. మరో 22ప్రాజెక్టుల పనులు యుద్ద ప్రాతిపదికన పూర్తి చేస్తున్నాం. మొత్తం 69 ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో చేస్తున్నాం. ఇంకో 14 ప్రాజెక్టులకు కొత్తగా శ్రీకారం చుట్టాం.
పోలవరం ప్రాజెక్టు పనులు 70% పూర్తి చేయడం ఒక చరిత్ర. రికార్డు వ్యవథిలో పట్టిసీమ పూర్తిచేశాం. 3ఏళ్లలో రూ.40వేల కోట్ల దిగుబడులు పట్టిసీమతో సాధించాం.
అసాధ్యం అన్నదానిని సాధ్యం చేసి చూపించాం. కాబట్టే భగీరధుడికి మనమే నిజమైన వారసులం.
భగీరథుడికి నివాళిగానే నీరు-ప్రగతి, నీరు-చెట్టు, జల సంరక్షణ ఉద్యమం- 1, 2-జలసిరికి హారతి కార్యక్రమాలు చేపట్టాం.
కరవుసీమ రాయల సీమ భూములను కృష్ణా జలాలతో తడపడం ఎంతో సంతృప్తిని ఇచ్చింది. గ్రామగ్రామానా రైతులు జలాలకు హారతులిచ్చి సంబరాలు చేసుకున్నారు.
వందలాది చెరువులను నింపాం. భూగర్భజలాలను పెంచాం. డ్రై అయిన బోర్ వెల్స్ రీఛార్జి అయ్యాయి. పులివెందులలో ఎండిపోయిన చీని చెట్లను బతికించాం.
వ్యవసాయాన్ని లాభసాటి చేస్తున్నాం. గ్రామీణ జీవన ప్రమాణాలు పెంచాం. మన పల్లెటూళ్లు భారత దేశానికే భాగ్యసీమలుగా చేస్తున్నాం.
భగీరథుడు మన ఆరాథ్య దైవం..భగీరథుడి వారసులుగా జల సంరక్షణకే కట్టుబడతాం. ప్రతి నీటి చుక్కను ఒడిసిపడతాం, భూగర్భంలో ఇంకింపచేస్తాం, భూగర్భ జలాలు పెంచుతాం. అదే భగీరథుడికి మనం అందించే నిజమైన నివాళి’’.













