Chandrababu: ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ పర్యటన సక్సెస్

నాలుగురోజులపాటు పర్యటన… సమావేశాలు, చర్చలు, సంప్రదింపులు
వివిధ కంపెనీ ప్రముఖులతో సమావేశమైన మంత్రి లోకేష్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తుకు బలమైన పునాదులు వేసే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన మంత్రివర్గ సహచరులు నాలుగు రోజులపాటు సింగపూర్ పర్యటించి రాష్ట్రానికి తిరిగి వచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu), మంత్రులు నారా లోకేశ్ (Nara Lokesh), పొంగూరు నారాయణ, టీజీ భరత్, ఉన్నతాధికారుల బృందం ఈ సింగపూర్ పర్యటనలో పలు అంతర్జాతీయ సంస్థలతో కీలక చర్చలు జరిపింది. ఈ పర్యటనతో రాష్ట్రానికి గణనీయమైన పెట్టుబడులు రావడం ఖాయమని అధికార వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. నాలుగు రోజుల పాటు సాగిన ఈ పర్యటనలో ముఖ్యమంత్రి 26 సమావేశాలు, కార్యక్రమాలలో పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కీలక చర్చలు, ఒప్పందాలు ఈ పర్యటనలో భాగంగా జరిగాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించటం, ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు చేపట్టిన సింగపూర్ పర్యటన విజయవంతంగా ముగిసింది. మంత్రులు నారా లోకేశ్, పి.నారాయణ, టీజీ భరత్ సహా ఉన్నతాధికారులతో కలిసి ముఖ్యమంత్రి సింగపూర్ లో నాలుగు రోజుల పాటు అవిశ్రాంతంగా వివిధ సమావేశాలు, రౌండ్ టేబుల్ చర్చల్లో పాల్గొన్నారు. సింగపూర్‌లోని ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులను సందర్శించి వాటిని రాష్ట్రంలో అమలు చేసేందుకు వీలుగా అధ్యయనం చేశారు. పర్యటనలో మొత్తం 26 కార్యక్రమాలకు సీఎం చంద్రబాబు, మంత్రులు హాజరయ్యారు. ఏపీలో అమరావతిని ప్రపంచ రాజధానిగా చేయాలని టీడీపీ కూటమి ప్రభుత్వం భావిస్తోంది. దీని కోసం గతంలోనే 2014 నుంచి 2019 మధ్యలోనే సింగపూర్‌తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అమరావతి రాజధాని అభివృద్ధి విషయంలో కూటమి ప్రభుత్వం సింగపూర్ మీదనే ఎక్కువ ఆశలు పెట్టుకుంది.
సింగపూర్ దేశాధ్యక్షుడు థర్మన్ షణ్ముగరత్నం, మాజీ ప్రధానమంత్రి, ప్రస్తుత సీనియర్ మంత్రి లీ సైన్ లూంగ్, వాణిజ్య, పరిశ్రమల శాఖామంత్రి టాన్ సీ లెంగ్, సెక్యూరిటీ, హోం వ్యవహారాల మంత్రి కె.షణ్ముగం తదితరులతో సీఎం సమావేశమయ్యారు.
మరోవైపు సుర్బానా జురాంగ్, సెంబ్ కార్ప్, ఎస్‌ఐఏ ఇంజనీరింగ్, ఏఐ సింగపూర్, కెప్పెల్ కార్పోరేషన్, జీఐసీ, ఎస్‌ఎంబీసీ, కాపిటాల్యాండ్ ఇన్వెస్ట్మెంట్, ఎవర్సెండై ఇంజనీరింగ్, టామ్ సెక్, విల్మర్, టీవీఎస్ మోటార్స్, మండై వైల్డ్ లైఫ్, అదానీ పోర్ట్స్ తదితర కంపెనీల ప్రతినిధులతో సమావేశమై రాష్ట్రంలోని అవకాశాలను ముఖ్యమంత్రి వివరిం చారు. పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, రాష్ట్రంలో అమలు చేస్తున్న పారిశ్రామిక అనుకూల పాలసీల గురించి సీఎం అవగాహన కల్పించారు. భారతదేశంలో పెట్టుబడులకు ఏపీ గమ్యస్థానంగా చేసుకోవాలని కోరారు.
రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌లో…
సింగపూర్ పర్యటనలో భాగంగా ఆ దేశ పారిశ్రామికవేత్తలు, ప్రముఖ కంపెనీల సీఈఓలు, ప్రతినిధులతో చంద్రబాబు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లో డేటా సెంటర్ల ఏర్పాటుకు అనుకూలమైన వాతావరణం ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. 2026 జనవరి నాటికి ప్రారంభమయ్యే క్వాంటం వ్యాలీలో సింగపూర్ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు అవకాశముందని అభిప్రాయపడ్డారు. ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సుకు మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, పి.నారాయణతోపాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమావేశానికి మొత్తం 41 కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరై తమ తమ అభిప్రాయాలు తెలియజేశారు.
జురాంగ్ పెట్రో కెమికల్ ఐల్యాండ్‌లో…
సింగపూర్ పర్యటనలో భాగంగా స్థానిక జురాంగ్ పెట్రో కెమికల్ ఐల్యాండ్‌ను సీఎం చంద్రబాబు నాయుడు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ తీర ప్రాంతంలోని కాకినాడ, మచిలీపట్నం, కృష్ణపట్నం పోర్టులను కలుపుతూ పారిశ్రామిక – లాజిస్టిక్ కారిడార్ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ఈ కేంద్రం ఏర్పాటు కోసం చేసిన ప్రణాళికలు, వివిధ యుటిలిటీ మోడల్స్‌తోపాటు లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలను చూపించారు. పెట్రో కెమికల్ కేంద్రంలో ముడి చమురు ప్రాసెసింగ్ ప్రక్రియతోపాటు ఇతర ఉత్పత్తుల్కెన పాలిమర్లు, ఇంధనాలు, స్పెషాలిటీ కెమికల్స్‌ను వారికి వివరించారు.
సుర్బానా జురాంగ్ ప్రతినిధులతో…
ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్టు గ్లోబల్ అర్బన్ ఇన్‌ఫ్రా కంపెనీ సుర్బానా జురాంగ్ స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఆ సంస్థ ప్రతినిధి చెర్ ఎక్లో భేటీ అయ్యారు. రాష్ట్రంలో గృహ నిర్మాణాలను పెద్దఎత్తున చేపట్టేందుకు ముందుకురావాలని సీఎం సుర్బానా సంస్థను ఆహ్వానించారు. హౌసింగ్ ఫర్ ఆల్ విధానంలో భాగంగా ఏపీలో సింగపూర్ మోడల్ హౌసింగ్ అంశంపై చర్చించారు. రాష్ట్రంలో మొత్తం 20 పోర్టులు, 15 ఎయిర్‌పోర్టులు అందుబాటులోకి వస్తున్నాయని.. లాజిస్టిక్ హబ్‌గా ఏపీ తయారవుతుందని తెలిపారు.
ఎవర్సెండై చైర్మన్‌తో భేటీ
మలేషియాకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ ఎవర్సెండై కార్పొరేషన్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ తాన్‌శ్రీ ఏ.కె.నాథన్ ముఖ్యమంత్రితో సమావేశం అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో అత్యాధునిక ఫాబ్రికేషన్ ఫ్యాక్టరీతో పాటు ఇంటిగ్రేటెడ్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పా టు అంశంపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. ఈ ఫ్యాబ్రికేషన్ ఫ్యాక్టరీని విశాఖ లేదా కృష్ణపట్నంలో ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు ఎవర్సెండై చైర్మన్ వివరించారు. అలాగే రాష్ట్రంలోని ఐఐటీ తిరుపతి, ఐఐఐటీ శ్రీసిటీ వంటి సంస్థలతో కలిసి స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ ట్రైనింగ్ సెంటర్ స్థాపనపైనా ఎవర్సెండై చైర్మన్ ముఖ్యమంత్రితో చర్చించారు.
ఏఐ సింగపూర్’ సంస్థ ప్రతినిధులతో…
ఏఐ సింగపూర్ సంస్థ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ మోహన్ కంకణవల్లితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఏఐ పరిశోధన, ఇన్నోవేషన్ సెంటర్ల ఏర్పాటుకు సహకారం అందించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలతో ఏఐ సింగపూర్ భాగస్వామిగా పని చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం కోరారు. రాష్ట్రంలోని విద్యార్థులకు ఏఐ శిక్షణా కార్యక్రమాలు, ఎక్ఛ్సేంజ్ ప్రోగ్రాములు, స్కిల్ డెవలప్‌మెంట్ మాడ్యూల్స్ అమలు చేయాలని సీఎం ప్రతిపాదించారు. ముఖ్యంగా వైద్యం, వ్యవసాయం, విద్య, పౌరసేవల విషయంలో ఏఐ వినియోగంపై ఇరువురి మధ్య చర్చలు జరిగాయి. టెక్నాలజీ ప్రమోషన్, డీప్‌టెక్, ఏఐ రంగంలో ప్రస్తుతమున్న అవకాశాలపైనా చంద్రబాబు- కంకణవల్లి మధ్య చర్చ జరిగింది.
ఎస్‌ఐఎ ఇంజినీరింగ్ కంపెనీతో…
ఎస్‌ఐఎ ఇంజినీరింగ్ కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎన్‌జీ జాన్ లిన్ విలిన్‌తోనూ చంద్రబాబు సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఎయిర్‌పోర్టుల నిర్మాణం, అభివృద్ధి ప్రణాళికలను జాన్ లిన్ విలిన్‌కు ముఖ్యమంత్రి వివరించారు. ఎంఆర్‌ఓ విధానం ద్వారా కొత్తగా నిర్మించే విమానాశ్రయ ప్రాజెక్టుల్లో భాగస్వామి కావాలని ఆహ్వానించారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఎస్‌ఐఎ ఇంజినీరింగ్ కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ తర్వలోనే రాష్ట్రానికి తమ కంపెనీ ప్రతినిధులను పంపిస్తామని ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు.
ఏపీ-సింగపూర్ బిజినెస్ ఫోరమ్ రోడ్ షోలో
విశాఖలో నిర్వహించనున్న భాగస్వామ్య సదస్సుకు సన్నాహకంగా ఏపీ-సింగపూర్ బిజినెస్ ఫోరమ్ తరపున ఏర్పాటు చేసిన రోడ్ షో కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. సమావేశానికి సింగపూర్ కంపెనీల ప్రతినిధులతోపాటు ఏపీ నుంచీ పెద్దఎత్తున ప్రతినిధులు హాజరయ్యారు. రోడ్ షోలో ఏపీలో అమలు చేస్తోన్న పారిశ్రామిక అనుకూల పాలసీలు, ప్రాజెక్టులు, పెట్టుబడులకు ఉన్న అవకాశాలతోపాటు ఏపీ అభివృద్ధి కోసం రూపొందించిన 2047 స్వర్ణాంధ్ర ప్రణాళికలపై ముఖ్యమంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ. ‘సింగపూర్ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలి. నవంబరు 14, 15 తేదీల్లో విశాఖపట్టణంలో పెట్టుబడుల సదస్సు ఉంది. సింగపూర్‌నుంచి డెలిగేషన్ ఆ పెట్టుబడుల సదస్సుకు రావాలి. విశాఖ సదస్సులో పెట్టుబడులపై ఎంఓయూలు కుదుర్చుకుందాం. జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌లో భాగంగా ఏపీ నుంచే మూడోవంతు గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చంద్రబాబు చెప్పారు.
పారిశ్రామికాభివృద్ధి కోసం 24 పాలసీలు రూపొందించాం. ఎలక్ట్రానిక్ మొబిలిటీ, వేస్ట్ రీసైకిలింగ్, ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్కులు, ఏరోస్పేస్, డిఫెన్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఎంఎంస్‌ఎంఈ, మారిటైమ్, మైనర్ మినరల్, స్పోర్ట్స్, టెక్స్‌టైల్ పాలసీలు రూపొందించాం. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా ఇచ్చాం. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ కంపోనెంట్స్, డేటా సెంటర్, ఇన్నోవేషన్, స్టార్టప్ పాలసీలను అత్యుత్తమంగా తీర్చిదిద్దాం. ఇన్నోవేషన్ సహా విమానాల మరమ్మత్తులు, నిర్వహణ, ఓవర్ హాలింగ్ రంగాల్లోనూ పెట్టుబడులను ఆకర్షించేలా విధానాలు రూపొందించాం. ఇన్‌ల్యాండ్ వాటర్ వేస్, రైల్ కార్గోలాంటి సదుపాయాలు కూడా ఏపీలో ఉన్నాయి. తక్కువ వ్యయంతో రవాణా అన్నదే మా లక్ష్యం. తద్వారా ఎగుమతులు, దిగుమతులకు పెద్దఎత్తున అవకాశాలు ఉన్నాయి’ అని చంద్రబాబు వివరించారు.
మా ప్రభుత్వం టెక్నాలజీకి పెద్ద పీట వేస్తోంది. ప్రస్తుతం డీప్ టెక్నాలజీ, టెక్ బేస్డ్ విద్యా వ్యవస్థపై ఏపీ ప్రభుత్వం పని చేస్తోంది. అమరావతిలో క్వాంటం వ్యాలీని నిర్మిస్తున్నాం. వివిధ విభాగాల సమాచారాన్ని డేటా లేక్ ద్వారా అనుసంధానిస్తాం. ఏఐ ద్వారా ఈ సమాచారాన్ని విశ్లేషించి పౌరసేవల్ని వాట్సాప్ ద్వారా అందిస్తున్నాం. గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ ద్వారా భవిష్యత్తులో క్లీన్ ఎనర్జీని సాధించాలన్నదే మా లక్ష్యం. భారత్ లక్ష్యంలో 160 మెగావాట్లను ఉత్పత్తి చేసే దిశగా ఏపీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ రంగంలో సింగపూర్ కంపెనీలకు విస్తృతమైన అవకాశాలున్నాయి. అమరావతి నిర్మాణంతోపాటు ఏరోస్పేస్, డిఫెన్సు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, డీప్ టెక్, ఎలక్ట్రానిక్స్, సెమికండక్టర్ల రంగంలో అపారమైన పెట్టుబడి అవకాశాలున్నాయి. అలాగే లాజిస్టిక్స్, ఫార్మా, బయోటెక్నాలజీ, పర్యాటకరంగంలో విస్తృత అవకాశాలను వినియోగించుకోవాలని కోరుతున్నాను. విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సుకు రండి. గ్లోబల్లీ కాంపిటీటివ్, ఇన్నోవేషన్ డ్రివెన్ సొసైటీలో భాగం కావాలని సింగపూర్ కంపెనీలకు ఆహ్వానం పలుకుతున్నాను. సింగపూర్ ప్రభుత్వంతో పాటు వివిధ కంపెనీల ప్రతినిధుల్ని కలిశాను. మీ పెట్టుబడులకు బెస్ట్ అండ్ సేఫ్ ప్లేస్‌గా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. భారత తూర్పుతీరానికి ఏపీ పెట్టుబడుల గేట్‌వేగా ఉంటుంది’’ అని ముఖ్యమంత్రి వివరించారు.
ఆంధ్రా- సింగపూర్ స్టార్టప్ ఫెస్టివల్
ముఖ్యమంత్రి పాల్గొన్న ఈ సమావేశంలో కొన్ని కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. సింగపూర్-ఏపీ స్టార్టప్ ఫెస్టివల్ నిర్వహిస్తే.. యువ పారిశ్రామికవేత్తలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందనే ప్రతిపాదన వచ్చింది. దీనిపై సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. స్టార్టప్ కంపెనీలకు తాము ఎప్పుడూ అనుకూలంగానే ఉంటామని స్పష్టం చేశారు. పారిశ్రామికవేత్తల నుంచి వచ్చిన ప్రతిపాదన మేరకు సింగపూర్-ఏపీ స్టార్టప్ ఫెస్టివల్ నిర్వహాణకు తాము సిద్ధంగా ఉన్నామని సీఎం స్పష్టం చేశారు. ఈ రోడ్ షోలో మంత్రులు లోకేష్, నారాయణ, టీజీ భరత్, ఏపీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఏపీ పోర్టుల అభివృద్ధికి సింగపూర్ మోడల్
సింగపూర్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ దేశం నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక టువాస్ పోర్టును సందర్శించారు. ఆసియాలోనే రెండో అతి పెద్ద కంటైనర్ టెర్మినల్ పోర్టుగా టువాస్‌ను సింగపూర్ ప్రభుత్వం నిర్మిస్తోంది. సింగపూర్ ప్రభుత్వం నిర్మిస్తున్న అతిపెద్ద టువాస్ పోర్టును సీఎం బృందం సందర్శించి అధ్యయనం చేసింది. టువాస్ పోర్టు సందర్శనలో భాగంగా పోర్ట్ ఆఫ్ సింగపూర్ అథార్టీ రీజనల్ సీఈఓ విన్సెంట్‌తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. పోర్టు నిర్మాణం మొదలుకుని పోర్టు నిర్వహణ, కార్యాకలాపాలు వంటి అంశాలపై టువాస్ పోర్టు అధికారులతో చంద్రబాబు బృందం చర్చించింది. పోర్టులు, ఎయిర్ పోర్టులు, పారిశ్రామిక కారిడార్లతో ఏపీని లాజిస్టిక్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు టువాస్ పోర్టు అనుసరిస్తున్న విధానాలు ఎంతవరకు ఉపకరిస్తాయన్న అంశంపై సీఎం చంద్రబాబు, మంత్రుల బృందం అధ్యయనం నిర్వహించింది. పోర్టు ఆధారిత పరిశ్రమలు, కార్యకలాపాలు నిర్వహణ వివరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ పోర్టు అథార్టీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈమేరకు ఏపీ పోర్టులను సింగపూర్ భాగస్వామ్యంతో అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దే అవకాశాలపై సింగపూర్ అధికారులతో ముఖ్యమంత్రి బృందం సమాలోచనలు జరిపింది. రియల్ ట్కెమ్ కార్గో ట్రాకింగ్, గ్రీన్ పోర్టు డెవలప్మెంట్, పోర్టుల్లో అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు సమగ్రమైన ప్రణాళికలువంటి విషయాల్లో సింగపూర్ అనుసరిస్తున్న విధానాలను అడిగి తెలుసుకున్నారు. ఏపీలోని పోర్టుల ఆధునీకరణలో సింగపూర్ మోడల్‌ను అనుసరించే అంశాన్ని కూడా సీఎం, మంత్రుల బృందం అధ్యయనం చేసింది.
సింగపూర్ దేశాధ్యక్షుడితో…
సింగపూర్ పర్యటనలో భాగంగా ఆ దేశాధ్యక్షుడు థర్మన్ షణ్ముగరత్నంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం అయ్యారు. ఏపీలో సింగపూర్ పెట్టుబడులు, వ్యాపార అభివృద్ధి అవకాశాలపై ఈ భేటీలో వీరిద్దరూ విస్తృతంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు, ముఖ్యంగా డిజిటల్, గ్రీన్ ఎనర్జీ రంగాలకు ఉన్న అపారమైన అవకాశాలను సింగపూర్ అధ్యక్షుడికి వివరించారు చంద్రబాబు. రాష్ట్రంలో పెట్టుబడులకు గల సానుకూల వాతావరణం, నూతన పారిశ్రామిక విధానాలను తెలిపారు. ఏపీలో సింగపూర్ సంస్థలు పెట్టుబడులు పెట్టడం ద్వారా ఇరు ప్రాంతాలు లబ్ధి పొందుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఏపీతో గత భాగస్వామ్యాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. భవిష్యత్తులో పరస్పర సహకారాన్ని అందించేందుకు ఆయన సానుకూలంగా స్పందించారు.
సమావేశం అనంతరం.. ‘ఇది కొత్త అధ్యాయానికి నాంది’ అంటూ సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. షణ్ముగరత్నంతో సాగిన సమావేశంపై సంతోషం వ్యక్తం చేస్తూ.. ‘మీతో సమావేశం గొప్ప ఆనందాన్నిస్తోంది. భారత్ `సింగపూర్ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించడమే కాదు, కొత్త అధ్యాయానికి అడుగులేస్తోన్న భావన కలుగుతోంది. జ్ఞాన, ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాలు, సెమీకండక్టర్లు, అమరావతి అభివృద్ధి, పట్టణ ప్రణాళిక, పునరుత్పాదకశక్తి వంటి రంగాలలో పరస్పర సహకారంగా సాగిన సుదీర్ఘ చర్చ సంతృప్తినిస్తోంది’ అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.