సత్యసాయి జయంతి వేడుకల్లో సీఎం చంద్రబాబు
పుట్టపర్తి శ్రీ సత్యసాయి నిలయంలో సత్య సాయిబాబా జయంతి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. సాయిబాబా సమాధిపై పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. సత్యసాయి బాబా 99వ జయంతి సందర్భంగా భారీ కేక్‌ను కట్ చేశారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ సత్యసాయి బాబాతో తనకున్న అనుబంధం అపురూపమైనదని చెప్పారు. మానవ సేవే మాధవ సేవ అని ప్రపంచానికి చాటిన గొప్ప వ్యక్తి బాబా అని కొనియాడారు. సత్యసాయిబాబా అందించిన మహా ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి అని, ఇక్కడకు వచ్చే ప్రతి భక్తుడికీ మనశాంతితో పాటు, సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అన్నారు. బాబా మనందరి మధ్య లేకపోయినా మనందరిలో ఆయన జీవించి ఉన్నారని అన్నారు. ఉన్నత స్థాయికి చేరాలనుకునే ప్రతి వ్యక్తీ బాబా సూక్తులను, మార్గాలను పాటిస్తే తప్పకుండా గమ్యం చేరుకుంటారని అన్నారు.
సత్యసాయి అనుగ్రహంతోనే పుట్టపర్తికి రాగలమని, బాబా పిలుపుతోనే ఇక్కడికి వచ్చానని చంద్రబాబు తెలిపారు. ఇక్కడకు వచ్చిన ప్రతిసారీ మహోన్నతమైన అనుభూతిని పొందుతానని, ఈ ప్రదేశాన్ని వదిలి వెళ్లాలనిపించదని, తనకు సమయం దొరికినప్పుడల్లా ఇక్కడకు రావాలనిపిస్తుందని అన్నారు. క్రమశిక్షణలో సత్యసాయి సెంట్రల్ ట్రస్టు ప్రపంచ దేశాల్లోని అన్ని సంస్థలకు ఆదర్శంగా నిలిచిందని ప్రశంసించారు.













