కియా కారును విడుదల చేసిన సీఎం చంద్రబాబు
అనంతపురం జిల్లా ఎర్రమంచిలో ప్రతిష్ఠాత్మక కియా కార్ల సంస్థ నుంచి తొలి కారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ తక్కువ సమయంలో కియా మోటర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టామని అన్నారు. 2017లో నిర్మాణం ప్రారంభించి ట్రయల్ ప్రొడక్షన్ స్థాయికి చేరుకుందని చెప్పారు. కొరియా, ఏపీ ప్రజలు ప్రపంచంలో ఎక్కడైనా రాణిస్తారని అన్నారు. కియో పెట్టుబడులతో అనంతపురం ప్రాంతం ఆటో మొబైల్ పారిశ్రామిక హబ్‌గా మారుతుందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. కొరియా రాయబారి ఏపీకి బ్రాండ్ అంబాసిడర్‌గా మారారని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో హీరో మోటర్స్, అపోలో టైర్, అశోక్ లేలాండ్, భారత్ ఫోర్డ్ వంటి సంస్థలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయన్నారు. పరిశ్రమలను ఆకట్టుకునేందుకు ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ వంటి విధానాలు తీసుకొచ్చామని చంద్రబాబు వివరించారు. కియో మోటర్స్‌కు భారత్ అతిపెద్ద మార్కెట్ అవుతుందని, ఏపీని సొంత ప్రాంతంగా భావించాలని కొరియా అధికారులు, సిబ్బందికి సూచించారు. భవిష్యత్‌లో రాయలసీమ రత్నాల సీమగా మారుతుందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్‌తో తమ బంధం సుదీర్ఘమైనదని కియో మోటర్స్ ఎండీ కుక్యున్ షిన్ అన్నారు. అనంతపురం ప్లాంట్‌ను త్వరితగతిన నిర్మించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకరించిందంటూ ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.













