Chandrababu: జమ్మలమడుగులో వైసీపీకి ఘాటు కౌంటర్ ఇచ్చిన చంద్ర బాబు..

తెలుగుదేశం పార్టీ అధినేత మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) కడప జిల్లా జమ్మలమడుగులో (Jammalamadugu, Kadapa) జరిగిన సభలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. తన స్పష్టమైన పదజాలంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) నాయకులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. రాజకీయాల్లో ఓవర్‌గా ప్రవర్తించినవారికి తగిన బుద్ధి చెప్పే అవసరం ఉందని, అవసరమైతే “తోకలు కట్ చేస్తా” అనే మాటలతో బలమైన వార్నింగ్ ఇచ్చారు.
జనంలో తిరుగడం ఒక రాజకీయ నాయకుడిగా సహజమే కానీ, ప్రజలకు అసౌకర్యం కలిగించే విధంగా వ్యవహరించడం సహించదగినది కాదని ఆయన స్పష్టం చేశారు. ప్రజల మధ్య స్వేచ్ఛగా తిరగాలంటే ఎవరూ ఆపరని, కానీ దాన్ని వక్రీకరించి హంగామా చేయాలని చూస్తే మాత్రం పరిణామాలు సీరియస్‌గా ఉంటాయని తేల్చి చెప్పారు. ముఖ్యంగా నెల్లూరు (Nellore) జిల్లాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) ఇటీవల నిర్వహించిన పరామర్శ యాత్రకు ఇది ప్రత్యక్షంగా కౌంటర్‌గా నిలిచింది.
వైఎస్సార్ కాంగ్రెస్ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి (Nallapureddy Prasanna Kumar Reddy) పరామర్శ వ్యవహారంపై చంద్రబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని పరామర్శించడం ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు. తాము అధికారంలో ఉన్నప్పటికీ తమ పార్టీలో తప్పు చేసినవారిని ఎవరైనా ఖండిస్తామని.. ముఖ్యంగా ఆడవారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే అసలు ఊరుకోమని ఆయన చెప్పడం గమనార్హం.
మాజీ మంత్రి వివేకానంద రెడ్డి (Vivekananda Reddy) హత్య కేసు గురించి మాట్లాడుతూ, తొలుత గుండెపోటు అంటూ చెప్పి చివరకు ఆయన చేతిలోనే కత్తి పెట్టారని ఆరోపిస్తూ తప్పుడు ప్రచారం జరిగిందని అన్నారు. రాజకీయాల్లో ఇలాంటి దుర్మార్గాలు చోటు చేసుకోవడం మంచిది కాదని ఆయన వ్యాఖ్యానించారు.
చంద్రబాబు తన ప్రసంగంలో సంక్షేమం, అభివృద్ధి అంశాలను కూడా ప్రస్తావించారు. గత ప్రభుత్వ హయాంలో పెన్షన్ లు ఆలస్యం అవుతున్నాయని, ఒక నెల మిస్ అయితే ఇక ఇవ్వరని చెప్పారు. కానీ ప్రస్తుతం ప్రభుత్వ పాలనలో రెండు నెలలు తీసుకోకపోయినా అందిస్తామని తెలిపారు. ప్రజల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని పని చేస్తున్నామని, అందరూ దీన్ని గమనించాలని కోరారు. చివరగా చెప్పాలంటే, జగన్ పర్యటనలపై చంద్రబాబు ఇచ్చిన కౌంటర్ చాలా ఘాటుగా ఉందని చెప్పొచ్చు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకు ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందన్న సంకేతాన్ని ఇచ్చారు. ఇక దీనిపై జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి..