Chandrababu :నరెడ్కో ప్రాపర్టీ షో ప్రారంభించిన సీఎం చంద్రబాబు
గత పాలకులు అన్ని రంగాలనూ పతనావస్థకు తీసుకొచ్చారని, రాష్ట్రాన్ని సమస్యల వలయంగా మార్చేశారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Cm chandrababu )విమర్శించారు. గుంటూరులోని చేబ్రోలు హనుమయ్య మైదానంలో నరెడ్కో ప్రాపర్టీ షో (Naredco Property Show )ను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ కొత్త ఏడాది నిర్మాణ రంగం వేగంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా. గత ప్రభుత్వ హయాంలో ఈ రంగం అధ్వానంగా మారింది. అధికారంలోకి రాగానే రాష్ట్ర పునర్ నిర్మాణం ప్రారంభించాం. ప్రధాని మోదీ (Prime Minister Modi) విశాఖకు వచ్చి రూ.2లక్షల కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడిప్పుడే ముందుకెళ్తోంది. నిర్మాణ రంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాం. ఈ రంగంపై 34 లక్షల మంది ఆధారపడి ఉన్నారు.
నరెడ్కో, క్రెడాయ్ (Credai) వంటి సంస్థలు కలిసి ముందుకు రావాలి. రియల్ ఎస్టేట్ సమస్యల పరిష్కారానికి ముందుంటాం. వైసీపీ పాలనలో అన్నింటికంటే ఎక్కువగా నిర్మాణ రంగం దెబ్బతింది. అధికారంలోకి రాగానే ఈ రంగాన్ని ప్రాధాన్యత ఇచ్చాం. ఎప్పుడు చూడనివిధంగా భూ సమస్యలపై దరఖాస్తులు వస్తున్నాయి. భూ కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుంటాం. గత ప్రభుత్వ నిర్వాకంతో టీడీఆర్ బాండ్లు తీసుకుని కొంతమంది నష్టపోయారు. స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ సాధన కోసం కృషి చేస్తున్నాం. మేం వచ్చాక రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులకు సంతకాలు చేశాం. ఐదేళ్లలో 20 లక్షల మందికి ఉపాధి కల్పించాలనేదే మా లక్ష్యం అని చంద్రబాబు అన్నారు.













