Chandrababu :అది నిరూపించేందుకు ఇక్కడ మహానాడు : చంద్రబాబు
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేవుని గడపలో తొలి మహనాడు సూపర్ హిట్ (Mahanadu super hit) అయిందని తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. మహానాడు బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ కడప (Kadapa) తెలుగుదేశం పార్టీ అడ్డా అన్నారు. అది నిరూపించేందుకు ఇక్కడ మహానాడు నిర్వహించామన్నారు. అన్ని దారులు కడపవైపే ఉన్నాయి. పార్టీ శ్రేణులతో కడప దిగ్బంధమైంది. కడప గడపలో మార్పు కనిపిస్తోంది. అహంకారంతో విర్రవీగే వారికి ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారు. వైసీపీకి రాయలసీమ (Rayalaseema) లో 7 సీట్లు వస్తే, కడప జిల్లా (Kadapa District ) లోనే కూటమి 7 గెలిచింది. 2029 ఎన్నికల్లో ఉమ్మడి కడపలో పదికి పది స్థానాలు గెలవాలి. టీడీపీ కార్యకర్తలే నా బలం, బలగం. మొన్నటి విజయం వెనుక కార్యకర్తల పోరాటం, త్యాగం, కష్టం ఉంది. గత పాలనలో హింసా రాజకీయాలు, కేసులు, అణచివేతలు, రాజ్యమేలాయి. విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిస్తామని టీడీపీ, జనసేన, బీజేపీ (Jana Sena- BJP) కూటమి ఏర్పాటు చేసి ప్రజలముందుకొచ్చాం. 94 శాతం స్ట్రైక్ రేట్‌తో అదిరిపోయే విజయం సాధించాం అని అన్నారు.
విధ్వంస రాష్ట్రం పునర్నిర్మాణానికి పనిచేస్తున్నాం. వైనాట్ గొడ్డలిపోట్లు అనేవి మన విధానం కాదు. ప్రతిపక్ష కష్టపడి పనిచేయడం మన విధానం. కష్టాలు చూసి బెదిరిపోలేదు, సవాళ్లు చూసి పారిపోలేదు. క్లైమోర్ మైన్లకే భయపడలేదు. సమస్యలకు భయపడతానా. ఇటుక, ఇటుక పేర్చుతూ విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తున్నాం. పేద ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడం నా జీవిత ఆశయం. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నా కష్టం నా కోసం కాదు. నన్ను నమ్మిన జనం కోసం. మనం కలిసికట్టుగా ఉంటే వైసీపీ అడ్రస్సే ఉండదు అని అన్నారు.













