కొద్ది నీటితోనే అనంత అద్భుతాలు
కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
కేంద్రం సహకరించకున్నా మన కష్టంతో 10.52% గ్రోత్ రేటు వచ్చిందని, రైతుల ఆదాయం రెట్టింపు చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేశారు. వ్యవసాయ ఉద్యానంలో అనంతపురం జిల్లా అగ్రస్థానంలో ఉందని, ఇచ్చిన కొద్ది నీటితోనే అనంతపురం జిల్లా రైతులు ఉద్యాన రంగంలో అద్భుత ఫలితాలు సాధించారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. రాయలసీమలో నీళ్లను సక్రమంగా వినియోగించుకుంటే సీమ రానున్న రోజులలో హార్టీకల్చర్ హబ్‌గా మారుతుందని చెప్పారు. ఉద్యానంలో పెట్టుబడులు తక్కువ, ఫలితాలు ఎక్కువని, రాయలసీమలోని నాలుగు జిల్లాలు రానున్న కాలంలో ప్రాథమిక రంగంలో ప్రధమంగా ఉంటాయని ముఖ్యమంత్రి తెలిపారు.
నాలుగైదు సంవత్సరాలలో నీరు, ఆర్థిక పరిస్థితుల విషయంలో ఎన్ని సమస్యలు వచ్చేవో ఆలోచిస్తే ఆందోళన కలుగుతుంది. కేవలం పట్టిసీమ వల్ల నీళ్లు ఇవ్వడం వల్లనే అనేక సమస్యల నుంచి గట్టెక్కగలిగామని ముఖ్యమంత్రి చెప్పారు.
ఆక్వాలో ప్రకాశం వెనుకంజ
కాలుష్య ప్రభావం, నీరు లేకపోవడం కారణాలుగా ఆక్వా కల్చర్‌లో ప్రకాశం జిల్లా వెనుకబడి వుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో నీళ్లు ఉన్నాయని, తీర ప్రాంతం ఉందని, అభివృద్ధికి వీలైన వాతావరణం ఉన్నప్పటికీ అవగాహన లేకపోవడంతో అభివృద్ధి సాధ్యం కావడం లేదని ముఖ్యమంత్రి అన్నారు. అవినీతిని సాంకేతికతతో చాలావరకు నియంత్రించగలిగామని, అవినీతి నిర్మూలనలో మూడవ స్థానంలో నిలిచినట్లు చెప్పారు. సాంకేతికత, జవాబుదారి విధానాల వల్లనే అవినీతి రహితంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దటంలో ఒక రోల్ మోడల్‌గా ఉండగలిగిన విషయాన్ని వివరించారు.
175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎం పార్కులు
రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో 175 ఎంఎస్ఎంఈ పార్కులను అభివృద్ధి చేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఉత్తమ సర్వీస్ ప్రొవైడర్లు, ఉత్తమ విజ్ఞాన భాగస్వాములను తీసుకొచ్చి ‘మెడ్ టెక్ పార్కు’ను ఒక అత్యుత్తమ నమూనాగా నిలిపిన విధానం అద్భుతమని ప్రశంసిస్తూ 175 ఎంఎస్ఎంఈ పార్కుల్ని ఇదే భావనతో అభివృద్ధి చేయాలనుకుంటున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు. 200 ఎకరాలలో ఆర్ అండ్ డీ, ప్రోడక్ట్ టెస్టింగ్, మార్కెటింగ్, వేర్ హౌసింగ్ తదితర సదుపాయాలతో దేశానికి ఒక నమూనాగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. మన రాష్ట్రానికి ఉత్తమ మానవ వనరులు ఉన్నాయని, సహజ వనరులకు కొదవలేదని, నైపుణ్యం, తెలివితేటలు ఉన్నాయని చెబుతూ ఒక సానుకూల వాతావరణం నెలకొల్పడానికి తగిన వసతులు మనకు ఉన్నాయని సీఎం చెప్పారు. ‘హబ్ అండ్ స్పోక్’ పద్ధతిలో ఎంఎస్ఎంఈలను అభివృద్ధి చేయనున్నామన్నారు.
వృద్ధి రేటులో అగ్రగామి మన రాష్ట్రం
నాలుగేళ్లుగా వరుసగా వృద్ధి ఫలితాలలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. 2014 నుంచి జాతీయస్థాయి కంటే ఎక్కువగా వృద్ధి ఫలితాలను సాధిస్తూ వస్తున్నామని చెప్పారు. వ్యవసాయంలో వర్షాభావం వల్ల వృద్ధిలో తగ్గుదల కనిపిస్తోంది. వనరులు పుష్కలంగా ఉన్నా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు ఇంకా కొంత వెనుకబడి ఉన్నాయన్నారు.
అర్హులందరికీ జన్మభూమి-మా ఊరులో ఇళ్ల మంజూరు
జనవరి రెండో తేదీనుంచి జరిగే ఆరో జన్మభూమిలో ఎన్ని ఇళ్ళు ఉంటే అన్ని అర్హులకు అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అందరికీ ఇళ్లు కట్టించే బాధ్యత తీసుకుంటామని భరోసా ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించిన తర్వాత రహదారులు, మురుగుకాల్వలు లాంటి మౌలిక సదుపాయాల కోసం వెనక్కి తిరిగి చూసుకోకూడదని, అన్ని సదుపాయాలతో పేదల గృహ సముదాయాలను అభివృద్ధి చేయాలని చెప్పారు.
వందశాతం సంతృప్త స్థాయి ఫలితాలు రావాలి
నూరు శాతం 100 శాతం సంతృప్త స్థాయి ఫలితాలు రావాలని, సుస్థిర వృద్ధితో పేదలకు ఆదాయం పెరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్ల సమావేశంలో కోరారు. ఆరోగ్యం, పోషకాహార విభాగాల్లో ప్రభుత్వ సేవలను మెరుగుపర్చాలని, ప్రైవేట్ భాగస్వాములు అందించే సేవలపై పర్యవేక్షణ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.













