Chandrababu: అందుకే ఈ విధానంలో ముందుకు వెళుతున్నాం : సీఎం చంద్రబాబు
కొత్తగా నిర్మించే ప్రభుత్వ వైద్య కళాశాలల మీద యాజమాన్యం, పెత్తనం పూర్తిగా ప్రభుత్వానికే ఉంటాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) స్పష్టం చేశారు. అవి ప్రభుత్వ ఆస్తులని, నిర్వహించేది మాత్రమే ప్రైవేటు వ్యక్తులని తేల్చిచెప్పారు. విజయవాడలోని తుమ్మలపల్లివారి కళాక్షేత్రంలో నిర్వహించిన అమరజీవి పొట్టిశ్రీరాములు (Potti Sriramulu) ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో మెరుగైన విద్య, సేవలు కావాలంటే ఆసుపత్రులు, కళాశాలల నిర్మాణానికి పీపీపీ విధానమే ఉత్తమమని పార్లీమెంటరీ స్థాయీ సంఘమే చెప్పిందని గుర్తు చేశారు. ఈ విధానంతో అత్యుత్తమ రహదారులు, విమానాశ్రయాలు వచ్చాయని పేర్కొన్నారు. పీపీపీ (PPP) విధానంలో ప్రభుత్వ వైద్య కళాశాలల (Government medical colleges) నిర్మాణాన్ని కావాలనే కొందరు రాజకీయం చేస్తున్నారని, ప్రైవేటూ అంటూ ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. సంపద సృష్టించడానికి ఏకైక విధానం పీపీపీనే. ఉదాహరణకు రహదారుల్ని ఈ విధానంలో నిర్మిస్తాం. 10`12 ఏళ్లు ప్రైవేటు వాళ్లు వాటిని నిర్వహించి మళ్లీ ప్రభుత్వానికి అప్పగిస్తారు. అవి ప్రభుత్వ ఆస్తులు, నిర్వహించేది ప్రైవేటు వ్యక్తులు. అందుకే పీపీపీ విధానంలో ముందుకు వెళుతున్నాం అని అన్నారు.






