కాపు రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం : చంద్రబాబు
కాపు రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సృష్టం చేశారు. విజయవాడలో నిర్వహించిన కాపుల ఆత్మీయ సమ్మేళనంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో కాపులకు రిజర్వేషన్లు తీసేశారని, కాపుల గురించి ఇప్పుడు మాట్లాడుతున్నవారు మేనిఫెస్టోలో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. చదువుకునే రోజుల నుంచే సామాజిక న్యాయం గురించి ఆలోచించానని చెప్పారు. కాపుల మనోభావాలను అర్థం చేసుకున్నానని, వీలైనంత త్వరలో మంజునాథ కమిషన్ నివేదిక వస్తుందని పేర్కొన్నారు. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కావాలని కాపులు కోరుతున్నారని, బీసీలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. త్వరలో కాపు భవనాన్ని నిర్మిస్తామని, వీలైనంత త్వరలో కాపు రిజర్వేషన్ల సమస్య పరిష్కారిస్తామన్నారు.
కాపులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఈ సందర్బంగా చంద్రబాబు భరోసా ఇచ్చారు. నోరు పారేసుకుంటే విశ్వసనీయత రాదు. నా బాధ్యత గురించి ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. కాపు రిజర్వేషన్లపై జగన్ టీడీపీని విమర్శించడం సిగ్టుచేటు. వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో కాపు రిజర్వేషన్లను ప్రస్తావించలేదు. వైసీపీ ప్లీనరీలోనూ కాపుల రిజర్వేషన్ల ఊసేలేదు అని ఆరోపించారు.
విభజనతో రాష్ట్రం చాలా నష్టపోయింది. హైదరాబాద్‌ను పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ప్రకటించినా మన రాష్ట్రం నుంచే పాలన కొనసాగించాలన్న ఉద్దేశంతోనే అమరావతికి వచ్చేశాం. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నాం. విభజన చట్టంలో పేర్కొన్న అన్ని హామీలను నెరవేర్చేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తూనే ఉన్నాం. కొందరు బీసీలను రెచ్చగొట్టి వివాదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాంటి వారి మాటలను నమ్మొద్దు అని చంద్రబాబు సృష్టం చేశారు.













