Chandrababu: ఈ విషయంలో పోలీసులకు పూర్తి స్వేచ్ఛ : సీఎం చంద్రబాబు
గంజాయి బ్యాచ్ ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని, ఈ విషయంలో పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) నాయుడు తెలిపారు. అనంతపురం (Anantapur) పట్టణంలో ఇంటర్ విద్యార్థిని హత్య, ఏడుగురాళ్లపల్లిలో బాలికపై అత్యాచారం ఘటనలపై సీఎం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేసు పూర్వాపరాలు పూర్తిగా తెలసుకున్న ముఖ్యమంత్రి, ఈ కేసులో నిందితులను వెంటనే శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వెంటనే విచారణ పూర్తి చేసి ఛార్జ్‌షీట్ (Chargesheet) దాఖలు చేసి ట్రయల్స్ పూర్తయ్యేలా చూడాలన్నారు. ప్రత్యేక శ్రద్ధతో పక్కాగా ఆధారాలు సేకరించి నిందితులకు అత్యంత కఠిన శిక్షలు పడేలా చూడాలని తెలిపారు.
మహిళలపై నేరాల విషయంలో పోలీసుశాఖ కఠినంగా వ్యవహరించాలని సూచించారు. నేరం చేయాలనే ఆలోచన ఉన్నవారు పోలీసులు (Police) తీసుకునే చర్యల గురించి భయపడే పరిస్థితి రావాలన్నారు. ఆడబిడ్డలపై క్షణికావేశంలోనే, గంజాయి మత్తులోనో, వ్యవస్థీకృతంగానో నేరాలకు పాల్పడే వారికి శిక్ష తప్పదనే అభిప్రాయాన్ని కలిగించాల్సి ఉందని అన్నారు. గత ప్రభుత్వంలో ఐదేళ్లు నేరగాళ్లపై నియంత్రణ లేదని, గంజాయి, డ్రగ్స్ (Drugs) , చట్టం అంటే భయం లేకపోవడం వల్ల నేరగాళ్లు అదుపులో లేకుండా పోయారని, దీంతో నేటికి కొందరు పాత అలవాట్లను మానుకోవడం లేదని అన్నారు.













