రాజధాని పనులు మరింత వేగవంతం
అమరావతి రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పనులు మరింత వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సిఆర్డీయే అధికారులతో ముఖ్యమంత్రి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఐఏఎస్, ఇతర అధికారుల నివాసాలకు సంబంధించిన ఆరు టవర్ల నిర్మాణం డిసెంబర్ లోగ పూర్తి చేయడానికి పనులు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. టవర్ల ఆకర్షణీయంగా, ఉన్నత నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి తెలిపారు. హైకోర్టు న్యాయమూర్తులకు ఒక టవర్ లో నివాసాలను కల్పించేలా ప్రణాళిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ప్రతి నెల రాజధాని పనుల ప్రగతి వివరాలను విడుదల చేయమని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. రాజధాని నవనిర్మాణం కోసం అనేక మంది దాతలు ముందుకు వస్తున్నారని, మనం చేసే పనులు వారికి సూార్తిేని కలిగించాలని ముఖ్యమంత్రి అన్నారు.
రాజధాని అభివృద్ధి పనులకు చేపట్టిన సిఆర్డీయే బాండ్ల కార్యక్రమంలో బిడ్డింగ్ వచ్చే మంగళవారం జరుగుతుందని అధికారులు వివరించారు. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి (బీఎస్ఈ )లో లిస్టింగ్ కు వెళ్తున్నామని, ఆ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రిని కోరారు. అందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. 10.3 శాతం వడ్డీ రేటుతో బాండ్లు విడుదల చేస్తున్నారు. రాజధాని రైతుల భూముల రిజిస్ట్రేషన్లు సజావుగా జరగడానికి మరో డిప్యూటీ కలెక్టర్ నియమించుకోమని ముఖ్యమంత్రి సూచించారు. మరి కొన్ని గ్రామాలకు చెందిన రైతులను సింగపూర్ పర్యటనకు పంపడానికి సీఎం అంగీకరించారు.













