అధికారులకు సీఎం చంద్రబాబు హెచ్చరిక.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే
వరద బాధితుల సమస్యలను పరిష్కరించేందుకు అన్ని చర్యలూ చేపట్టామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. విజయవాడ కలెక్టరేట్ వద్ద మీడియాతో చంద్రబాబు మాట్లాడారు. కొన్ని చోట్ల ఆహారం అందలేదని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విజయవాడ నగరంలో డివిజన్‌కు ఒక సీనియర్ ఐఏఎస్‌ను నియమించామని తెలిపారు. 32 మంది ఐఏఎస్ అధికారులు సహాయక చర్యల్లో ఉన్నారన్నారు. పది జిల్లాల నుంచి ఆహారం సమకూర్చామని, బాధితులకు మూడు పూటలా అందించాలని ఆదేశించినట్లు తెలిపారు. చిట్టచివరి బాధితుడికి కూడా సాయం అందాలని స్పష్టం చేశారు.













