Ontimitta :ఒంటిమిట్టలో అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణం
వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట (Ontimitta )లో పండు వెన్నెల్లో శ్రీకోదండరాముని కల్యాణ్సోతవం అంగరంగ వైభవంగా జరిగింది. సీతారామ చంద్రుల కల్యాణ మహోత్సవ సందర్భంగా కోదండ రామాలయాన్ని శోభాయమానంగా ముస్తాబు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) దంపతులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఏకశిలా నగరంగా పేరొందిన ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన సీతారాముల కల్యాణోత్సవాన్ని వీక్షించేందుకు భక్తజనం అశేషంగా తరలివచారు.
హస్తా నక్షత్ర యుక్త శుభలగ్నంలో జరిగిన జానకిరాముల పరిణయ వేడుకలను తిలకించడానికి వచ్చిన భక్తులకు కల్యాణ తలంబ్రాలను పంపిణీ చేశారు. వాటిలో పాటు తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం (Tirumala Srivari Laddu Prasadam) , పసుపు, కుంకుమలు అందజేశారు. సాయంత్రం 6:30 నుంచి రాత్రి 8:30 గంటల వరకు కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. జగత్ కల్యాణ ఘట్టం పండు వెన్నెలతో కనులపండువగా సాగింది. సీతారాముల కల్యాణం (Sita and Rama’s wedding) జరిగిన ప్రాంగణం కొంగొత్త శోభతో దేవీప్యమానంగా ప్రకాశించింది. దేశవిదేశాల నుంచి తీసుకొచ్చిన అరుదైన పుష్పాలతో కల్యాణ మండపాన్ని అలకరించారు. సీఎం చంద్రబాబు దంపతులు ఉత్సవం చివరి వరకు వీక్షించి స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. ఒంటిమిట్లలోనే రాత్రి బస చేశారు.













