Srisailam: తిరుమల తరహాలో శ్రీశైలం అభివృద్ధి : చంద్రబాబు

తిరుమల తరహాలో శ్రీశైలం (Srisailam) క్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అధికారులను ఆదేశించారు. దేవాదాయ, అటవీ శాఖల అధికారులతో ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి కోసం రెండు వేల హెక్టార్ల అటవీ భూమిని దేవాదాయ శాఖకు కేటాయించేలా కేంద్ర అటవీ మంత్రిత్వశాఖకు ప్రతిపాదన పంపాలని పేర్కొన్నారు. ఈ నెల 16న ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) శ్రీశైలం రానున్న దృష్ట్యా, ఆలయ అభివృద్ధిపై ఆయనతో చర్చించాలని నిర్ణయించారు. శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి దేవస్థానం అభివృద్ధి మాస్టర్‌ప్లాన్ రూపొందించాలి. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు వస్తున్నారు. రద్దీకి తగినట్లు సౌకర్యాలు కల్పించాలి. దోర్నాల, సున్నిపెంట, ఈగలపెంట ప్రాంతాలకు సమీపంలో ఉన్న జాతీయ రహదారులను శ్రీశైలం క్షేత్రానికి అనుసంధానించాలి. దీన్ని ఆధ్యాత్మిక,పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేలా ప్రణాళికలు ఉండాలి అని చంద్రబాబు పేర్కొన్నారు.
తిరుమల (Tirumala) తర్వాత రెండో అతి పెద్ద ఆలయంగా అభివృద్ధి చెందుతున్న శ్రీశైలంలో సరైన పార్కింగ్ సదుపాయాలు లేవు. భూమి లేకుండా పెద్దసంఖ్యలో వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించలేం. ఢల్లీిలోని అటవీ మంత్రి త్వ శాఖను అధికారుల బృందం కలిసి పరిస్థితిని వివరించాలి. ఆలయ అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి. అభయారణ్యంలో పులుల సంఖ్య పెరిగేలా ప్రణాళిక సిద్ధం చేయాలి అని అటవీ శాఖ అధికారును ఆదేశించారు.