తమిళనాడుతో పాటు దేశానికి తీరని లోటు : చంద్రబాబు
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని ఏర్పాటు చేసుకున్న డీఎంకే అధినేత కరుణానిధి చనిపోవడం తమిళనాడుతో పాటు దేశానికి తీరని లోటు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో నోడల్ అధికారుల రాష్ట్రస్థాయి సదస్సు సందర్భంగా ముఖ్యమంత్రి సంతాప తీర్మానాన్ని చదివి వినిపించారు. సభికులతో కలిసి రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. తమిళ ప్రజలు, కరుణానిధి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తమిళనాడును అగ్రశేణి రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో కరుణానిధి సేవలు అసమానమని కీర్తించారు. కరుణానిధి రాటుదేలిన రాజకీయ వేత్త. కోట్ల మందిని ప్రభావితం చేసిన విలక్షణ నాయకుడు. తమిళనాడులో తిరుగులేని నేత. దక్షిణ భారతదేశంలో పెద్ద రాజకీయ శక్తిగా ఇన్ని సంవత్సరాల పాటు కొనసాగారు. రాజకీయ రంగంలోనే కాకుండా కళా రంగంలోనూ తనదైన ప్రత్యేకత చాటుకున్నారు. ఎన్నో సామాజిక మార్పులకు నాంది పలికారు. కరుణానిధితో నాకు మంచి అనుభవం ఉంది. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్తో ఆయన చాలా సన్నిహితంగా మెలిగేవారు. 1996లో యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేసినప్పుడు కరుణానిధి అండగా నిలిచారు అని అన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడిన వ్యక్తి కరుణానిధి అని కొనియాడారు. గొప్ప పరిపాలనా దక్షుడు, సామాజిక ఉద్యమ నేత రుణానిధి అని తెలిపారు.













