గీతం మూర్తి మృతి పట్ల సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
గీతం యూనివర్సిటీ వ్యవస్థాపకులు, ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంపీగా, ఎమ్మెల్సీగా ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. విద్యావేత్తగా, విద్యాదాతగా ఆయన ప్రజల్లో చెరగని ముద్ర వేశారన్నారు. గీతం సంస్థను స్థాపించి వేలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దారని కొనియాడారు. విద్య, రాజకీయ రంగాలకు మూర్తి లేని లోటు ఎవరూ తీర్చలేరని చంద్రబాబు అన్నారు. ఆయన మృతి తెలుగుదేశం పార్టీకి, విశాఖ ప్రజలకు తీరని లోటన్నారు టీడీపీ ముఖ్య నేతలందరూ రోడ్డు ప్రమాదాల్లోనే మృతిచెందడం తనను కలిచివేస్తోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎంవీవీఎస్ మూర్తి మృతిచెందారు. అలస్కాలోని ఆంకరేజ్ సిటీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన చనిపోయారు. సఫారీ పార్క్‌కు వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది. మూర్తితో పాటు కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు కూడా మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు.













