పార్లమెంటు స్థానాలూ తగ్గించేస్తారేమా?
విభజన సందర్భంగా రాష్ట్రానికి ఇచ్చిన హామీలు నెరవేర్చనందుకే కేంద్రంతో విభేదించి ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చినట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. విభజన సందర్భంగా జరిగిన అన్యాయం కంటే ఈ నాలుగేళ్లలోనే రాష్ట్రానికి ఎక్కువ అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. హామీల గురించి గట్టిగా ప్రశ్నించక పోతే రాష్ట్రం ఇంకా నష్టపోతుందనే కేంద్రాన్ని నిలదీస్తున్నామన్నారు. విభజనతో సమస్యల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం సహకరించకుండా పోయిందన్నారు. అమరావతిలో ప్రారంభమైన కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15వ ఆర్థిక సంఘం తీరును గమనిస్తే మరింత బాధ కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
2011 జనాభా లెక్కలు పరిగణనలోకి తీసుకుంటే దక్షిణ భారతానికి పార్లమెంటు సీట్లు కూడా తగ్గిపోయే ప్రమాదం వుందన్నారు. ఇది ప్రగతి శీల రాష్ట్రాలకు అన్యాయం చేసినట్టే అవుతుందన్నారు. నాలుగు సంవత్సరాలు కష్టపడి దేశంలో ఎక్కడా జరగని అభివృద్ధిని సాధించి నందుకు ప్రతి ఒక్క ఉద్యోగిని అభినందిస్తున్నానని అన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండింటి మీత తమ ప్రభుత్వం సమాన దృష్టి పెట్టినట్లు తెలిపారు.













