పరిశ్రమల రాయితీలకు రూ.956 కోట్లు
పరిశ్రమలకు రాయితీ ప్రోత్సాహకాల కింద రూ.955.41 కోట్లు తక్షణం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయించారు. అలాగే, మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాల కింద వెంటనే రూ.676 కోట్లు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుతో కలిసి ముఖ్యమంత్రి గురువారం సాయంత్రం సచివాలయంలో రాష్ర్ట ఆదాయ వ్యయాలపై సమీక్ష జరిపారు. పరిశ్రమలకు అందించే రాయితీలను బడ్జెట్ కేటాయింపుల నుంచే కాకుండా అవసరమైతే ఏపీఐఐసీ నుంచి రుణంగా తీసుకునే మొత్తం నుంచి అందించాలని ముఖ్యమంత్రి సూచించారు. మహిళా సంఘాలకు పెట్టుబడి నిధి, వడ్డీ రాయితీ, తదితర బకాయిలను విడతలవారీగా త్వరలో అందించాలని చెప్పారు.
2017-18 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రాష్ట్ర ఆదాయం రూ.32,978 కోట్ల మేర ఉండగా, వ్యయం రూ.35,463 కోట్లుగా ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే ఏపీలో ఉద్యోగుల జీతభత్యాల వ్యయం ఎక్కువగా ఉన్నదని తెలిపారు. తొలి త్రైమాసికంలో జల వనరులశాఖ రూ.4,435 కోట్ల వ్యయంతో అన్ని శాఖల కంటే అత్యధిక నిధులు వెచ్చించింది. రూ.4225 కోట్ల వ్యయంతో సెకండరీ ఎడ్యుకేషన్ రెండవ స్థానంలో నిలిచింది. రూ.571 కోట్ల ఖర్చుతో రెవిన్యూ శాఖ తక్కువ వ్యయం చేసిన శాఖగా నిలిచింది. ఆర్థిక నిర్వహణలో పబ్లిక్ ఫైనాన్సింగ్ వ్యవహారాల్లో ఆరితేరిన ప్రైవేట్ సంస్థల సహాయాన్ని తీసుకోవాలని యోచిస్తున్నట్టు ముఖ్యమంత్రి ఈ సమావేశంలో చెప్పారు. ఆశించిన వృద్ధి ఫలితాల సాధనకు మెరుగైన ఆర్థిక నిర్వహణ అవసరమని భావిస్తున్నట్టు తెలిపారు.
ప్రభుత్వ లావాదేవీలన్నీ ఇ-కుబేర్ ద్వారా నిర్వహించాలని సన్నద్ధమవుతున్నట్టు అధికారులు తెలిపారు. కేంద్రం తీసుకొచ్చిన వస్తు సేవల పన్ను అమలు ప్రభావం ఎలా ఉందనే అంశంపై సమగ్ర పరిశీలన చేయాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం జనవరి-డిసెంబరు మధ్య కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణించాలని భావిస్తున్నందున ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆర్థిక సంవత్సరం మార్పుపై నిర్ణయం తీసుకోవాల్సివుందని సమావేశంలో ప్రస్తావించారు. అదే జరిగితే 2018 బడ్జెట్ను ఈ ఏడాది నవంబరులోనే ప్రవేశపెట్టడానికి సన్నద్ధంగా వుండాలని నిర్ణయించారు. ఏప్రిల్ నుంచి డిసెంబరు 31 వరకు కాలాన్ని ఈ ఏడాది ‘ట్రాన్సిషనల్ ఫైనాన్సియల్ ఇయర్’గా పరిగణిస్తారు.
ఏపీఎస్ఆర్టీసీ తీసుకున్న రుణాలపై వడ్డీభారాన్ని తగ్గించాలని 7 బ్యాంకులకు చేసిన సూచన మేరకు 12.5 శాతం నుంచి 8.4 శాతంగా వుండే వడ్డీ శాతాన్ని 8.4 శాతం నుంచి 9 శాతానికి తగ్గించడం వల్ల ఏటా రూ.46.11 కోట్ల భారం తగ్గిందని అధికారులు వివరించారు. ఏపీ పౌర సరఫరాల సంస్థ వడ్డీ భారాన్ని కూడా తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. సమావేశంలో ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, ఆర్థికశాఖ కార్యదర్శులు రవిచంద్ర, సునీత, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీశ్ చంద్ర పాల్గొన్నారు.













