అమరావతిలో అమెరికా రాయబారికి సత్కారం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశం నిమిత్తం రాజధాని అమరావతికి విచ్చేసిన భారత్లోని అమెరికా రాయబారి కెన్నెత్ ఐ జస్టర్, హైదరాబాద్లోని అమెరికా కాన్సులేట్ జనరల్ కేథరిన్ బి. హడ్డాలు చారిత్రక అమరావతిని సందర్శించారు. ఈ సందర్భంగా వారికి అమరావతి నగర వారసత్వ సలహాదారు గల్లా అమరేశ్వర్, అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ కార్యదర్శి జాస్తి వీరాంజనేయులు సాదర స్వాగతం పలికారు. వారికి అమరావతి విశేషాలను వివరించారు. ఈ సందర్భంగా వారిని ఘనంగా సత్కరించి జ్ఞాపిక అందజేశారు. ఈ సందర్భంగా జాస్తి వీరాంజనేయులు మాట్లాడుతూ ప్రపంచంలోనే అగ్రరాజ్యమైన అమెరికా తరపున భారతదేశంలో ఉన్న రాయబారి చారిత్రాత్మక నగరమైన అమరావతికి రావడం గొప్ప పరిణామమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు అమెరికాతో సత్సంబంధాలు కలిగి ఉన్నందున రాష్ట్రానికి అనేక పెట్టుబడులు వస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో రాయబారి పర్యటనతో రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశాలున్నాయన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సెప్టెంబర్లో అమెరికాలో పర్యటించనున్నట్లు పేర్కొన్నారు.













