పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో నదులు అనుసంధానం చేపట్టి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సీఎం పనుల ప్రగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ గోదావరి, పెన్నా, నాగావళి, వంశధార నదులు అనుసంధానం వల్ల రాష్ట్రానికి సాగు, తాగునీటి కొరత తీరడమే కాకుండా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ, వైకాపా పోలవరం ప్రాజెక్టుకు అడ్డుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. ప్రజలను రెచ్చగొట్టే ధోరణితోనే కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర చేపట్టిందని ఆరోపించారు. ప్రస్తుతం ప్రాజెక్టు వద్ద పనులు వేగం పుంజుకున్నాయని తెలిపారు. రాష్ట్రంలో 29 సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడానికి లక్ష్యంగా నిర్దేశించుకోగా ఇప్పటికి 9 ప్రాజెక్టులు పూర్తి చేశామన్నారు. మరో 8 ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. గోదావరి, పెన్నా నదుల అనుసంధానం 5 ఫేజ్‌ల ద్వారా పూర్తి చేస్తామని, దీనివల్ల రాష్ట్రం సుభిక్షం అవుతుందని అన్నారు.













