Skill Development Case: స్కిల్ డెవలప్మెంట్ కేసులో నిజంగానే చంద్రబాబుకు ఈడీ క్లీన్ చిట్ ఇచ్చిందా..?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సంచలనం సృష్టించిన కేసులో స్కిల్ డెవలప్మెంట్ ఒకటి. ఈ కేసులోనే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని జగన్ ప్రభుత్వం అప్పట్లో అరెస్టు చేసి జైలుకు పంపించింది. 53 రోజులపాటు జైలులో ఉంచింది. స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో ఒప్పందం కుదుర్చుకున్న సంస్థలకు చంద్రబాబు ఆయాచిత లబ్ది చేకూర్చారని.. ఆ డబ్బు తిరిగి టీడీపీ నేతల ఖాతాల్లోకి వచ్చిందనేది ఈ కేసు సారాంశం. అయితే ఈ కేసులో మనీలాండరింగ్ కు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా జోక్యం చేసుకుని విచారణ జరిపింది. ఇందులో చంద్రబాబు నాయుడు పేరు ఎక్కడా బయటకు రాలేదు.
ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి డిజైన్ టెక్ సంస్థలకు సంబంధించి 23 కోట్ల రూపాయల ఆస్తులను ఫ్రీజ్ చేసినట్లు ఈడీ ప్రకటించింది. ఈడీ ఇలా ప్రకటించగానే చంద్రబాబుకు గట్టి షాక్ తగిలింది.. తదుపరి అరెస్టు చంద్రబాబుదే అని వైసీపీ నేతలు హడావుడి చేశారు. ఆ పార్టీ అనుబంధ పత్రిక కూడా చంద్రబాబు చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోందని రాసుకొచ్చింది. అదే సమయంలో టీడీపీ శ్రేణులు మాత్రం చంద్రబాబుకు ఈడీ క్లీన్ చిట్ అని సోషల్ మీడియాలో ఫుల్లుగా ప్రచారం చేసుకున్నాయి. తెలుగుదేశం అధికారిక పేజీల్లో కూడా పోస్టులు వచ్చాయి.
దీనిపై జగన్ ప్రెస్ మీట్ పెట్టి తీవ్రంగా స్పందించారు. ఈడీ ఎక్కడా చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇస్తున్నట్టు చెప్పలేదని.. అయినా టీడీపీ ఇలా అసత్య ప్రచారాలు చేసుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీకి ఇలాంటి అసత్య ప్రచారాలు చేయడం అలవాటేనన్నారు. స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో అవకతవకలు జరిగాయని తాము కేసు పెట్టామని.. ఇప్పుడు ఆ అవకతవకలు నిజమేనని ఈడీ నిర్ధారించిందని చెప్పుకొచ్చారు. త్వరలో చంద్రబాబుపైన కూడా చర్యలు ఉంటాయని వెల్లడించారు. తాము పెట్టిన కేసు ఆధారంగానే ఈడీ ఈ ఆస్తులను అటాచ్ చేసిందని జగన్ అభిప్రాయపడ్డారు.
నిజానికి ఈడీ కూడా చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇస్తున్నట్టు ఎక్కడా ప్రకటించలేదు. అసలు చంద్రబాబుపై ఈడీ కేసే నమోదు చేయలేదు. ఈడీ ఛార్జ్ షీట్ లో చంద్రబాబు పేరు లేనేలేదు. కేవలం డిజైన్ టెక్, సీమెన్స్ సంస్థల పేర్లు మాత్రమే ఉన్నాయి. వాటిపైన మాత్రమే ఈడీ విచారణ జరిపింది. అందులో చంద్రబాబు పేరు ఎక్కడా బయటకు రాలేదని ఈడీ ప్రతినిధులు నేషనల్ మీడియాకు చెప్పడంతో ప్రధాన ఇంగ్లీష్ పేపర్లన్నింటిలో ఈ వార్త వచ్చింది. ఆ వార్తలను కోట్ చేస్తూ టీడీపీ కూడా క్లీన్ చిట్ ఇచ్చినట్లు హడావుడి చేసింది. అసలు ఈడీ కేసులో చంద్రబాబు పేరే లేని విషయం చాలా మందికి తెలీదు.
నాడు జగన్ ఆధ్వర్యంలో సీబీసీఐడీ స్కిల్ డెవలప్మెంట్ కేసు పెట్టి విచారణ జరిపింది. ఇందులో చంద్రబాబును నిందితుడిగా చేర్చింది. అరెస్టు చేసి జైలుకు పంపించింది. ఇది ఇంకా విచారణ దశలోనే ఉంది. ఈ కేసులో మనీలాండరింగ్ జరిగినట్లు తేలడంతో ఈడీ జోక్యం చేసుకుని ఆ దిశగా విచారణ జరిపింది. మనీలాండరింగ్ జరిగిందని నిర్ధారణ కావడంతో ఆస్తులు అటాచ్ చేసింది. ఇప్పుడ ఆస్తుల అటాచ్ చేసిన విషయాన్ని జగన్ దోషిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రాథమిక దశలో ఈడీ ఇలా ఆస్తులను ఆటాచ్ చేయడం మామూలే. తర్వాత వాటిని మళ్లీ డీఫ్రీజ్ చేస్తుంటుంది. గతంలో జగన్ కేసుల్లో కూడా 800 కోట్లకు పైగా ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. వాటిలో కొన్నింటిని తర్వాత డీఫ్రీజ్ చేసింది. కాబట్టి ఆస్తుల అటాచ్ చేశారు కాబట్టి దోషి అని చెప్పేందుకు కుదరదు. అలా అయితే జగన్ ను కూడా దోషిగానే పరిగణించాల్సి ఉంటుంది. చంద్రబాబు పేరే లేని ఈడీ కేసులో ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చిందని ఒకరు.. లేదని మరొకరు వాదించుకోవడం మాత్రం ఆసక్తి రేపుతోంది.













