దాసరి వ్యక్తి కాదు.. వ్యవస్థ : చంద్రబాబు
దాసరి నారాయణరావు మృతి తెలుగు జాతికే తీరని లోటని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. హైదరాబాద్ ఫిలింఛాంబర్లో దాసరి నారాయణరావు భౌతికకాయానికి ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ దాసరి నారాయణరావు మృతితో సినీ పరిశ్రమ పరిశ్రమ పెద్దదిక్కును కోల్పోయింది. ఆయన వ్యక్తి కాదు వ్యవస్థ అని అన్నారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చి దర్శకుడిగా, రచయితగా, నటుడిగా, రాజకీయ నాయకుడుగా ప్రత్యేకత సాధించుకున్న వ్యక్తి అని కొనియాడారు. బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం పోరాటం చేశారని, సినీ రంగం సంక్షేమం కోసం ఎనలేని సేవలు అందించారు. ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టినట్లు చెప్పేవారు. చిన్నప్పట్నుంచీ ఆయన నాకు తెలుసు. మోహన్‌బాబు ద్వారా ఆయనతో పరిచయమైంది. మా కుంటుంబంతో ఆయనకు చాలా సన్నిహిత్యం ఉంది. నన్ను సొంత కుటుంబసభ్యుడిగా చూసుకునేవారు. సినీ, రాజకీయ రంగాలకు ఆయన చేసిన సేవలు శాశ్వతంగా గుర్తుంటాయి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని, ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నట్లు చెప్పారు.













