Chandrababu: ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు
నాడు రాజకీయ తరగతులు… నేడు విద్యా బుద్దులు…
గండిపేట గుర్తులు… అలనాటి స్మృతులు
విలువలతో కూడిన విద్యను అభ్యసించండి
కార్యకర్తల పిల్లలకు చదవు చెప్పేందుకు విద్యా సంస్థలు స్థాపించాం
దేశం మెచ్చే విద్యా సంస్థగా ఎన్టీఆర్ విద్యా సంస్థలు వెలుగొందాలి
ఎన్టీఆర్ పట్టుదలే నారా భువనేశ్వరికి వచ్చింది
హైదరాబాద్, డిసెంబర్ 27: గండిపేట ప్రాంగణానికి రాగానే పాత స్మృతులు… అలనాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. హైదరాబాద్ లోని గండిపేటలో శనివారం ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి పాల్గొన్నారు. కాలినడకన తిరుగుతూ ఎన్టీఆర్ స్కూల్ ప్రాంగణాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్ సంస్థకు చెందిన విద్యార్థులు గాడ్ ఆఫ్ ఆనర్ సమర్పించారు. అక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను సీఎం చంద్రబాబు దంపతులు ఆసక్తిగా తిలకించారు. జ్యోతి ప్రజ్వలన చేసి వార్షికోత్సవాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ…”గండిపేటకు వస్తే పాత విషయాలు గుర్తుకు వస్తాయి.
గండిపేట తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంగా ఉండేది. ఒకప్పుడు రాజకీయ నాయకులకు శిక్షణ ఇచ్చే కేంద్రంగా గండిపేట ఉండేది.. ఇప్పుడు విద్యార్థులకు శిక్షణ ఇస్తోంది. గండిపేటలో భావితరాల కోసం నాయకత్వాన్ని తయారు చేశాం. ఇప్పుడు విద్యార్థులు చదువుకుంటున్న తరగతుల్లోనే నాడు నాయకత్వ శిక్షణ శిబిరాలు నిర్వహించాం. ఫ్యాక్షన్ గొడవలు, రోడ్డు ప్రమాదాల్లో చనిపోయినవారి కుటుంబాల్లోని పిల్లలకు పెద్ద దిక్కుగా ఉండేలా ఎన్టీఆర్ విద్యా సంస్థలు ప్రారంభించాం. చిన్న మొక్కగా ప్రారంభించిన విద్యా సంస్థలను పెద్ద వృక్షంగా మార్చారు. ఎన్టీఆర్ ట్రస్టు, విద్యా సంస్థలను నారా భువనేశ్వరి సమర్థవంతంగా నడిపిస్తున్నారు. ఎన్టీఆర్ విద్యా సంస్థల్లో చదువుకున్న వారు గ్రూప్-1 పరీక్షల్లో నలుగురు పాస్ అయ్యారు, ముగ్గురు జూనియర్ సివిల్ జడ్డీలుగా ఎంపికయ్యారు. ఎన్టీఆర్ విద్యా సంస్థల్లో విద్యనభ్యసించిన వారికి దేశంలోని వివిధ ప్రముఖ విద్యా సంస్థల్లో 29 మందికి సీట్లు వచ్చాయి. 131 మంది విద్యార్థులతో విద్యా సంస్థను ప్రారంభించాం… ఇప్పుడు 1641 మంది చదువుతున్నారు. సంస్థ ఈ స్థాయికి ఎదగడానికి నారా భువనేశ్వరినే కారణం.”అని ముఖ్యమంత్రి అన్నారు.
చదువు ముఖ్యం… విలువలు మరింత ముఖ్యం
“SSC 11 బ్యాచులు, CBSE 8 బ్యాచులు, ఇంటర్ 9 బ్యాచులు, డిగ్రీ 7 బ్యాచులు ఎన్టీఆర్ విద్యా సంస్థల నుంచి బయటకు వచ్చాయి. నల్సార్, ఎన్.ఎల్.యూ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో సీట్లు సాధించారు. సమాజంలో సమానత్వం కోసం పరితపించే వ్యక్తి ఎన్టీఆర్. ట్రస్ట్ పెట్టి పిల్లలకు చదువు చెప్పించే ఏకైక రాజకీయ పార్టీ తెలుగుదేశమే. మన సంస్కృతి-సంప్రదాయాలను మరిచిపోవద్దు. ఆధునాతన విధానాల్ని అందిపుచ్చుకోవాలి… విలువలను కాపాడుకోవాలి. విద్యార్థులందరూ లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. ఆ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలి… టెక్నలాజీని అందిపుచ్చుకోవాలి. ఆన్ లైన్, ఆఫ్ లైన్ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ఎడిషనల్ కోర్సులు చేయండి. నిరంతరం నేర్చుకునే అంశంపై ఫోకస్ పెట్టండి. విద్యతో పేదరికాన్ని జయించవచ్చు… అప్పుడు సంపద తనంతట వస్తుంది. ప్రాణత్యాగాలు చేసిన కార్యకర్తల కుటుంబాల పిల్లలకు ఈ విద్యా సంస్థల ద్వారా విద్యను అందిస్తున్నాం. దేశం మెచ్చే విధంగా విద్యా సంస్థలను రన్ చేయాలి. విద్యార్థులు చక్కగా చదువుకుని సమాజంలో గుర్తింపు దక్కించుకోవాలి… ఎన్టీఆర్ విద్యా సంస్థలకు విద్యార్థులే బ్రాండ్ అంబాసిడర్లు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఇప్పటి వరకు 10 లక్షల మందికి రక్తదానం చేశారు. 273 మంది తలసేమియా బాధిత చిన్నారులకు ఉచితంగా రక్త మార్పిడి చేశారు. సంజీవని క్లినిక్ ల ద్వారా 22 లక్షల మందికి ఆరోగ్య సేవలు అందించారు. ప్రకృతి విపత్తుల్లో బాధితులను ట్రస్ట్ ద్వారా ఆదుకుంటున్నారు. ట్రస్ట్ ద్వారా రక్షిత తాగునీటిని అందిస్తున్నారు.”అని సీఎం అన్నారు.

నేను టెక్నాలజీ గురించి చెబుతోంటే… భువనేశ్వరి టెక్నాలజీని వాడుతున్నారు
“నన్ను చాలా మంది ఐఏఎస్ చేయమన్నారు. కానీ రాజకీయాల్లోకి రావాలని డిసైడ్ అయ్యాను. యూనివర్శిటీ నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచాను. రెండేళ్లల్లో మంత్రిని అయ్యాను. ఆ తర్వాత సీఎం.. ఇప్పుడు నాలుగో సారి సీఎంగా విధులు నిర్వహిస్తున్నాను. నేను రాజకీయాల్లో బిజీగా అయ్యాక… హెరిటేజ్ బాధ్యతలు చూడమని నారా భువనేశ్వరిని కోరాను. అయిష్టంగా హెరిటెజ్ బాధ్యతలు తీసుకున్న నారా భువనేశ్వరి ఆ సంస్థను అద్భుతంగా అభివృద్ధి చేశారు. పట్టుదలతో హెరిటేజ్ సంస్థను నడిపించారు. నేను ఇంకా పేపర్ చూసి స్పీచ్ ఇస్తున్నాను… భువనేశ్వరి ట్యాబ్ చూసి స్పీచ్ ఇస్తున్నారు. నేను టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నాను… భువనేశ్వరి టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ఎన్టీఆర్ మాదిరిగా భువనేశ్వరికి పట్టుదల ఉంది… మొండితనమూ ఉంది. భువనేశ్వరి ఏదైనా చేయాలని సంకల్పం తీసుకుంటే పట్టుదలతో చేస్తారు. భార్యగా, తల్లిగా, గృహిణిగా, ట్రస్టీగా, హెరిటెజ్ ఎండీగా భువనేశ్వరి చాలా విజయాలు సాధించారు. నేను సీఎంగా, పార్టీ అధ్యక్షునిగా పని చేస్తున్నాను… కానీ భువనేశ్వరి చాలా పాత్రలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. భువనేశ్వరి చేస్తున్న కృషికి లండన్ లో ఇన్సిటిట్యూట్ ఆఫ్ డైరెక్టర్ సంస్థ రెండు అవార్డులు ఇచ్చింది. వ్యక్తిగత అవార్డుతోపాటు… హెరిటెజ్ సంస్థను అద్భుతంగా నడిపిస్తున్నందుకు గోల్డెన్ పీకాక్ అవార్డు ఇచ్చారు.”అని ముఖ్యమంత్రి చెప్పారు.
ఎన్టీఆర్ స్పూర్తితో సేవలందిస్తున్నాం : భువనేశ్వరి
ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవంలో పాల్గొన్న ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి మాట్లాడుతూ…”విద్యార్థుల ఆశలకు అనుగుణంగా వారి భవిష్యత్తును రూపుదిద్దుతున్నాం. మానవ సేవే మాధవ సేవ అని ఎన్టీఆర్ నమ్మారు.. దానికి అనుగుణంగానే ఎన్టీఆర్ ట్రస్ట్ పని చేస్తోంది. ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి హెల్త్ కేర్ సర్వీసులు, తలసేమియా సెంటర్, ఎన్టీఆర్ సంజీవని క్లినిక్కులు పని చేస్తున్నాయి. పేద, అనాధ పిల్లలకు ఉచిత విద్య అందిస్తున్నాం. సివిల్ సర్వీసెస్ అకాడెమీ ద్వారా యూపీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారికి శిక్షణ ఇప్పిస్తున్నాం. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు… ప్రకృతి వైపరీత్యాల వల్ల కష్టాల్లో ఉన్నప్పుడు వారిని అన్ని విధాలా ఆదుకుంటున్నాం. స్త్రీశక్తి ద్వారా పేద మహిళలకు ఉపాధి కల్పిస్తున్నాం. ఎన్టీఆర్ సుజల ద్వారా రక్షిత తాగునీటిని సరఫరా చేస్తున్నాం. పేదల జీవితాల్ని బాగుపరిచేలా, విద్యార్థులకు అండగా నిలిచేలా, కుటుంబాలను ఆదుకునేలా ఎన్టీఆర్ ట్రస్ట్ పని చేస్తోంది… ఇదే ఎన్టీఆర్ కు మేం ఇచ్చే నివాళి. ఎన్టీఆర్ విద్యా సంస్థల ద్వారా చదువుకున్న వారు వివిధ ప్రాధాన్యత రంగాల్లో రాణిస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే టీచర్లు ఎన్టీఆర్ విద్యా సంస్థల్లో ఉన్నారు. బాహ్య ప్రపంచంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొవాల్సి ఉంటుంది… దానికి ఇక్కడి నుంచే సంసిద్దమవ్వండి. కోట్లాది మంది హృదయాలను ఎన్టీఆర్ గెలుచుకున్నారు. ఎన్టీఆర్ స్పూర్తితో.. ఆయన చూపిన దారిలో ఎన్టీఆర్ విద్యా సంస్థలను, ఎన్టీఆర్ ట్రస్టును నడుపుతున్నాం.”అని భువనేశ్వరి అన్నారు.
స్పూర్తినిచ్చారు… కెరీర్ తీర్చిదిద్దారు…
ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవంలో ఆ సంస్ధలో చదువుకున్న పూర్వ విద్యార్థులు పలువురు ప్రసంగించారు. తనకు విద్యాబుద్దులు నేర్పించి… చక్కటి భవిష్యత్తు కల్పించిన సీఎం చంద్రబాబు దంపతులకు పూర్వ విద్యార్థి హరికృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం తాను సినాప్సిస్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నట్టు హరికృష్ణ వెల్లడించారు. అలాగే ఎన్టీఆర్ విద్యా సంస్థలే తన కెరీర్ ను తీర్చిదిద్దాయని మరో పూర్వ విద్యార్థిని ఉమ శ్రీ చెప్పారు. ఎయిర్ హోస్టెస్ అయిన తాను ఎంటర్ ప్రెన్యూయర్ గా కొనసాగుతున్నట్టు ఉమ శ్రీ వెల్లడించారు. ఎన్టీఆర్ విద్యా సంస్థల ఎన్యూవల్ రిపోర్టులను స్కూల్, కాలేజీ ప్రిన్సిపాల్స్ జోజి రెడ్డి, రామరావు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ ట్రస్ట్, హెరిటెజ్ ఫుడ్స్ సంస్థలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.






