Chandrababu: పవన్ కల్యాణ్‌కు సీఎం చంద్రబాబు పరామర్శ

కొద్దిరోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను (Pawan Kalyan) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) పరామర్శించారు. హైదరాబాద్‌లోని పవన్ నివాసానికి చంద్రబాబు వెళ్లారు. ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రస్తుతానికి జ్వర తీవ్రత లేదని, ఎడతెరిపి లేకుండా దగ్గు వస్తోందని పవన్ చంద్రబాబుతో చెప్పారు. క్రానిక్ బ్రాంకైటీస్ వల్లే దగ్గు, గొంతు నొప్పి వస్తోందని వైద్యులు తెలిపారని వివరించారు. అనంతరం ఇరువురి మధ్య పలు అంశాలు చర్చకొచ్చాయి. మెగా డీఎస్సీ (DSC) ని విజయవంతంగా నిర్వహించి, ఉపాధ్యాయ ఉద్యోగాలివ్వటం, ప్రత్యేక కార్యక్రమంతో నియామక పత్రాలు అందించటం ద్వారా యువతలో మనోధైర్యం, స్ఫూర్తి నింపారని పవన్‌కల్యాణ్ ప్రస్తావించారు. చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని అక్టోబరు 4న ప్రారంభిస్తామని చంద్రబాబు చెప్పగా, ఈ పథకం అందరి మన్ననలు పొందుతుందని పవన్ అన్నారు. జీఎస్టీ 2.0 సంస్కరణలపై అవగాహన కల్పించేందుకు చేపట్టబోయే జీఎస్టీ ఉత్సవ్ నిర్వహణపైనా చర్చించారు. అక్టోబరు 16న ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలం రానున్న నేపథ్యంలో ఆ పర్యటన విజయవంతానికి అనుసరించాల్సిన కార్యచరణపై మాట్లాడారు.