పోలవరం ఆగిపోయే పరిస్థితి వస్తే ఎంతవరకైనా వెళ్తా
పోలవరం ప్రాజెక్టు ఆగిపోయే పరిస్థితి వస్తే ఎంతవరకైనా వెళ్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సృష్టం చేశారు. ప్రతి సోమవారం పోలవరం సమీక్ష నిర్వహిస్తున్న చంద్రబాబు ఈ రోజు ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును గడువులోగా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. తప్పుడు ఆరోపణలతో పోలవరం ప్రాజెక్టు పనులకు అడ్డుపడొద్దని, ప్రజల మనోభావాలు దెబ్బతీస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్టు భావితరాలకు భద్రత అని గుర్తు చేశారు. పోలవరం నిర్వాసితులకు ఉదారంగా కాదు బాధ్యతగా పునరావాసం కల్పిస్తామని అన్నారు. పోలవరంలో కాంట్రీక్ వర్క్స్ మినహా ఇతర పనులు వేగవంతం చేశామని, కాంక్రీట్ పనులు పూర్తిచేసి కాఫర్ డ్యాం నిర్మిస్తే, వచ్చే ఏడాదిలో గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వొచ్చన్నారు.
పోలవరం ప్రాజెక్టుపై రూ.12,506 కోట్లు ఖర్చు చేశామని, కేంద్రం నుంచి రూ.4,390 కోట్లు, ఇంకా రూ.3200 కోట్లు ఇవ్వాలని గుర్తు చేశారు. వపర్ ప్రాజెక్ట్‌కు రూ.4వేల కోట్లు ఇవ్వాలని, 2013 చట్టంతో భూసేకరణ వ్యయం పది రెట్లు పెరిగిందని చెప్పారు. యూపీఏ తెచ్చిన చట్టం వల్లే పరిహారం ఖర్చు బాగా పెరిగిందని, ఆ చట్టం ప్రకారం నిర్వాసితులకు ఇవ్వాలా వద్దా విపక్షాలు చెప్పాలన్నారు. 98 వేల గిరిజన కుటుంబాలకు పునరావాసం కల్పించాలని, ప్రతి కుటుంబానికి సగటున రూ.18 లక్షలు చెల్లించాల్సి వస్తుందని పేర్కొన్నారు. పోలవరం వివరాలు ఎప్పటికప్పుడు ప్రకటిస్తున్నామని, శ్వేతపత్రం ఎందుకని ఆయన ప్రశ్నించారు. ప్రాజెక్టు పనులపై ప్రతి సోమవారం సమీక్ష చేస్తున్నామని తెలిపారు.













