2026 నాటికి భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం పూర్తి చేస్తాం : చంద్రబాబు
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతం ఒక ఎకనామిక్ హబ్‌గా మారుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విహంగ వీక్షణం ద్వారా భోగాపురం విమానాశ్రయం ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ భోగాపురం వరకు బీచ్‌రోడ్ నిర్మాణం కూడా జరగాలి. పారిశ్రామికంగా ఎదిగేందుకు భోగాపురం ప్రాంతానికి మంచి అవకాశాలున్నాయి. నేను సీఎంగా ఉన్నపుడే అన్ని అనుమతులు వచ్చాయి. నేషనల్ హైవే నుంచి విమానాశ్రయానికి రోడ్ల కనెక్టివిటీ పెంచాలి. గత ప్రభుత్వ వైఖరి వల్ల అన్నీ మళ్లీ మొదటి నుంచి చేయాల్సి వస్తోంది. భోగాపురం విమానాశ్రయం ప్రారంభంలోనే 48 లక్షల మంది ప్రయాణికులతో రన్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఉత్తరాంధ్ర యువత ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఎన్డీయే కూటమికి ఉత్తరాంధ్ర బ్రహ్మరథం పట్టింది. అండగా నిలిచిన ప్రజలకు ఏదైనా చేయాల్సి ఉంది. అందుకే జిల్లా పర్యటనల్లో మొదటగా ఉత్తరాంధ్రకు వచ్చాను. 2026 జూన్ నాటికి భోగాపురం విమానాశ్రయం తొలిదశ పూర్తి చేస్తాం. వేగంగా పూర్తి చేయించే బాధ్యత కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడిపై ఉంది అని అన్నారు.













