అవార్డుల గ్యాలరీ ప్రారంభించిన సీఎం చంద్రబాబు
అధికారులు, ప్రజాప్రతినిధులంతా సమష్టిగా పనిచేయడం వల్లే మంచి ఫలితాలతో రాష్ట్రానికి 670 అవార్డులు వచ్చాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. వివిధ ప్రభుత్వ శాఖలకు కేంద్రం ఇచ్చిన అవార్డులతో శాసన సభ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు ఇన్ని అవార్డులు రావటం సంతోషంగా ఉందన్నారు. మనం చేసిన పనికి ఈ అవార్డులు గుర్తింపు అని ఆయన వ్యాఖ్యానించారు. కొత్త రాష్ట్రంలో ఇబ్బందుల నడుమ పనులు ప్రారంభించామని అన్నారు. చిత్తశుద్ధితో పనిచేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రానికి జాతీయ, అంతర్జాతీయ అవార్డులు రావడంతో ప్రభుత్వ ప్రతిష్ఠ మరింతగా పెరిగిందని అభిప్రాయపడ్డారు. బాగా పని చేసేందుకు ఈ అవార్డులు స్ఫూర్తినిస్తాయని అన్నారు. ఐదేళ్లలో ఏం సాధించామో ప్రజలకు చెప్పేందుకు ఈ ప్రదర్శన ఉపయోగపడుతుందని తెలిపారు.













