స్వయంగా లబ్దిదారుల ఇంటికెళ్లి పెన్షన్ అందజేసిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్లో అందరికీ ఒక రోజు ముందుగానే సామాజిక పెన్షన్లు అందాయి. డిసెంబరు 1వ తేదీ ఆదివారం కావడంతో, నవంబరు 30వ తేదీనే ఇంటింటికీ తిరిగి పెన్షన్ల ప్రక్రియను అధికారులు పూర్తిచేశారు. సీఎం చంద్రబాబు కూడా అనంతపురం జిల్లా నేమకల్లులో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన స్వయంగా కొందరి ఇంటికి వెళ్లి పెన్షన్లు అందజేశారు. నేమకల్లులో నివశించే దివ్యాంగురాలు భాగ్యమ్మ ఇంటికి వెళ్లిన ఆయన.. ఆమె కుటుంబ పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. ఆమెకు దివ్యాంగ పింఛను రూ.15 వేలు అందజేశారు. అదే గ్రామంలో రుద్రమ్మ అనే వితంతు మహిళ ఇంటికి కూడా వెళ్లి పెన్షన్ అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. అణగారిన వర్గాలకు అండగా ఉండడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ఎన్నికల హామీ మేరకు పెంచిన పెన్షన్లను ఏప్రిల్ నుంచి లెక్కగట్టి ఇచ్చామని తెలియజేశారు.













