పేదల కళ్లల్లో వెలుగే నిజమైన సంక్రాంతి
పెన్షన్ల రెట్టింపు పెద్ద కానుక
ముఖ్యమంత్రి చంద్రబాబు భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు
ఈనెల 14 భోగి, 15 సంక్రాంతి
పెన్షన్లను రెట్టింపు చేసి ఇంటికి పెద్దకొడుకుగా సంక్రాంతి కానుక ఇచ్చామని, ఇది తనకెంతో సంతప్తినిస్తోందని, నిరు పేద ప్రజల కళ్లల్లో వెలుగు చూడటమే తనకు నిజమైన సంక్రాంతి అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 50,61,906 సామాజిక భద్రత పెన్షన్లు ఇస్తున్నట్లు తెలిపారు. దివ్యాంగులకు నెలకు రూ. 3 వేలు, రెండు చేతులు లేని దివ్యాంగులకు రూ.10 వేలు ఇవ్వనున్నామని చంద్రబాబు తెలిపారు.
రాష్ట్ర ప్రజలకు, దేశ విదేశాల్లోని తెలుగువారికి ముఖ్యమంత్రి భోగి, మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగువాకిట వెలుగు ముగ్గులు వేసి మన సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పే సృజనాత్మక వేడుక సంక్రాంతి పండుగ అని చంద్రబాబు అన్నారు. సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించే పుణ్యకాలమని అనాదిగగా విశ్వాసం ఉందన్నారు. ధనుర్మాసంలో చలి వాతావరణం, పల్లె లోగిళ్లలో ఆహ్లాదం వెల్లివిరుస్తుందని, జానపద కళారూపాల సందడి నెలకొంటుందని చెప్పారు.
భోగిమంటలతో ప్రారంభమయ్యే సంక్రాంతి సంబరాలు కనుమతో ముగించడం మన సంప్రదాయమని గుర్తు చేశారు. రంగురంగుల రంగవల్లులు, వైవిధ్యమైన ముగ్గులు తెలుగింటి ఆడపడుచుల కళా సృజనకు నిదర్శనమని చెప్పారు. జీవన సమరంలో ఎక్కడో దూర తీరాల్లో ఉంటూ పండుగ వేళ కుటుంబ సభ్యులు, బంధు, మిత్రులు కలుసుకుంటున్నారని, ఇది మన దేశ కుటుంబ వ్యవస్థ గొప్పదనమని, పల్లె సీమల్లో వెల్లివిరిసే ఆత్మీయతకు, సుహృద్భావ సంబంధాలకు నిదర్శనమన్నారు. పంట చేతికొచ్చిన సంతోషంతో పండుగే సంక్రాంతి అని అందుకే ఇది రైతుల నిజమైన పండుగ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
సంక్రాంతి నవ్యాంధ్రప్రదేశ్‌కు నవ క్రాంతి, నాలుగున్నర ఏళ్ల నాడు విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో ప్రజలు తన అనుభవానికి, పరిపాలనా దక్షతకు పట్టం కట్టారని, ఎక్కడా రాజీపడకుండా రాష్ట్ర పురోభివృద్ధికి రోజుకు 18 గంటలు కష్టపడుతున్నానని, ప్రభుత్వ యంత్రాంగం, సిబ్బంది సహకారంతో రాష్ట్రం రెండంకెల వృద్ధిరేటు సాధించిందని చంద్రబాబు గుర్తు చేశారు. గత నాలుగేళ్లుగా వర్షపాతం తక్కువగా ఉన్నా వ్యవసాయరంగం వృద్ధి రేటు 17.18-% నమోదైందన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో రైతుల ఆదాయం రెట్టింపు అయ్యిందని, 2013-14కు రూ.1.28 లక్షల కోట్లు వచ్చిందని, 2017-18లో ఇది 2.53 లక్షల కోట్లకు పెరిగిందని (18.97%) సీఎం వివరించారు. రైతుల పండుగ అయిన సంక్రాంతి ప్రకృతికి కర్షకులు నివేదించే కృతజ్ఞతల వేడుక అని చంద్రబాబు అభివర్ణించారు.
పట్టిసీమ ద్వారా నాలుగేళ్లలో రూ. 44 వేల కోట్ల విలువైన పంట పండిందని గుర్తు చేశారు. ఇదే సమయంలో రాయలసీమకు కృష్ణా జలాలు తీసుకెళ్లి చెరువులు నింపామని, క్రమక్రమంగా కరవుఛాయలు తొలగిపోతున్నాయని చెప్పారు. పట్టిసీమ స్ఫూర్తితో పంచనదుల మహా సంగమ పనులకు శ్రీకారం చుట్టిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టు 65%కు పైగా పూర్తయ్యిందని, ఇటీవల కాంక్రీటు పనులలో ప్రపంచ రికార్డులు నెలకొల్పిన అంశాన్ని సీఎం ప్రస్తావించారు. రాజధాని అమరావతి నిర్మాణ పనులు శరవేగంతో పరుగులు తీస్తున్నాయని, కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం తథ్యమని, కియా మోటారు కార్ల పరిశ్రమను అనంతపురమునకు తెచ్చామని గుర్తుచేశారు. బిడ్డల భవితకు రాష్ట్రాభివృద్ధిని కొనసాగించడానికి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు తమకు తిరిగిమద్దతు పలకాలని, ఆశీర్వదించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు.













