ఎన్టీఆర్ మోడల్ పాఠశాల వార్షికోత్సవంలో చంద్రబాబు
అంతర్జాలమే అన్నీ నేర్పిస్తోంది
సాంకేతికతతో మరింత చేరువవుతున్న విద్య
అమరావతిలో వర్చువల్ తరగతులు
ఎన్టీఆర్ మోడల్ పాఠశాల వార్షికోత్సవంలో సీఎం చంద్రబాబు
సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయని.. ఉపాధ్యాయులు అందుబాటులో లేకున్నా విద్యనభ్యసించే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. అంతర్జాలం అన్ని విషయాలను నేర్పిస్తోందన్నారు. శనివారం గండిపేట కుటీరంలోని ఎన్టీఆర్ మోడల్ పాఠశాల వార్షికోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ‘మార్పునకు అనుగుణంగా ఉపాధ్యాయులు మారకపోతే వెనకబడిపోయే ప్రమాదం ఉంది. తరగతిలో చదువులు, క్షేత్రస్థాయిలో అధ్యయనం రెండింటినీ సమన్వయం చేస్తూ విద్యార్థులను ఆవిష్కరణల వైపు నడిపించే బాధ్యత ఉపాధ్యాయులదే. పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తల పిల్లల చదువుల కోసం ప్రారంభించిన ఈ పాఠశాలలో ఇప్పుడు ఇతరులు కూడా చదువుకుంటున్నారు. పేద పిల్లల కోసం గురుకుల పాఠశాలను తొలిసారిగా ప్రారంభించింది ఎన్టీఆరే. అట్టడుగు వర్గాల నుంచే నాయకులు తయారవ్వాలని, నైపుణ్యం పెంచుకునేందుకు రాజకీయ నాయకులకు కూడా శిక్షణ ఉండాలని ఆయన చెబుతుండేవారు. అందుకు అనుగుణంగానే గండిపేట కుటీరం వేదికగా రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించా. నేను సాంకేతికతను బలంగా నమ్ముతాను. అందుకే అమరావతిలో వర్చువల్ తరగతుల ద్వారా పిల్లలకు విద్యనందిస్తున్నాం. రియల్‌టైమ్ గవర్నెన్స్ ద్వారా అత్యుత్తమ పరిపాలన అందిస్తున్నాం. అవినీతికి తావులేకుండా, సమయం వృథా కాకుండా ఉపకారవేతనాలు, ధ్రువపత్రాలు లభిస్తున్నాయి.
వైవిధ్యమైన రంగాల్లో రాణించాలి
సిలికాన్‌వ్యాలీలో అత్యధిక వేతనాలు అందుకుంటున్నవారు భారతీయులే. వారంతా పేదరికం నుంచే ఎదిగారు. విద్యార్థులు వారిని ఆదర్శంగా తీసుకోవాలి. వైవిధ్యమైన రంగాల్లో విద్యార్థులు రాణించాలి. ఏపీ రాజధాని అమరావతిలోని 9 నగరాల్లో ఒక నగరానికి జస్టిస్ సిటీగా శ్రీకారం చుట్టాం. న్యాయవిద్యలో నైపుణ్యం సాధించిన విద్యార్థులకు జస్టిస్ సిటీలో అవకాశాలు కల్పిస్తాం. ఆంధ్రప్రదేశ్‌ను ఇన్నోవేషన్ వ్యాలీగా తయారుచేస్తున్నాం. భారతదేశానికి పెద్ద ఆస్తి ఈనాటి బాలలే. 2029లో ప్రపంచంలోనే యువకులు అధికంగా ఉన్న దేశంగా భారతదేశం ఆవిర్భవిస్తుంది’ అని చంద్రబాబు చెప్పారు. చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్టు ట్రస్టీ నారా భువనేశ్వరి మాట్లాడుతూ… ఉపాధ్యాయ వృత్తి అంటే తనకెంతో గౌరవమన్నారు. ఎన్నో అవకాశాలు మీకోసం ఎదురుచూస్తున్నాయని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో మంత్రి లోకేశ్ తదితరులు పాల్గొన్నారు.













