ప్రతి ఒక్కరూ మనస్సాక్షిగా ఆలోచించాలి
మళ్లీ ఆశీర్వదించండి: మన చంద్రబాబు
ప్రతి ఒక్కరూ మనస్సాక్షిగా ఆలోచించాలి
మాపై తెలంగాణ ప్రభుత్వ పెత్తనమేంటి?
ఏపీలో తెలంగాణ వాళ్ల పాలన కావాలా?
ఐదేళ్లపాటు సంక్షేమ కార్యక్రమాలను అందరికీ అందించామని తెదేపా అధినేత, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషికి 720 అవార్డులు వచ్చాయన్నారు. విభజన కష్టాలున్నా ముందుకెళ్తున్నామని ఆయన వివరించారు. అమరావతిలో మీడియాతో ఆయన మాట్లాడారు. ‘‘తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు సిద్ధంగా ఉంది. వైకాపా అధ్యక్షుడు జగన్..శాసనసభకు రారు.. భవిష్యత్తులో వచ్చే అవకాశం కూడా ఉండదు. విభజన హామీలు నెరవేర్చాలని కోరితే మాపైనే దాడులు చేస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో పదేళ్లపాటు చాలా కష్టాలు ఎదుర్కొన్నాం. తాగునీరు, సాగునీరు, విద్యుత్ కోసం ఇబ్బందులు పడ్డాం. తెదేపా అధికారంలోకి వచ్చాక రైతులకు రూ.24,500 కోట్ల రుణమాఫీ చేశాం. అన్నదాత సుఖీభవ కింద రైతులకు ఆర్థిక సాయం చేశాం. దేశంలో ఎక్కడాలేని విధంగా మౌలిక వసతులు కల్పించాం’’ అని చంద్రబాబు చెప్పారు.
ప్రతి ఒక్కరూ మనస్సాక్షిగా ఆలోచించాలి
‘‘ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. ఒక వర్గమనే కాకుండా రాష్ట్ర హితం, భావి తరాల భవిష్యత్తు కోరే ప్రతి ఒక్కరూ మనస్సాక్షిగా ఆలోచించాలి. తనపై విమర్శలు చేసే వారిపైనా ప్రజలంతా ఆలోచించాల్సిన అవసరముంది. ఈ ప్రభుత్వం వల్ల వచ్చిన లాభాలేంటి.. తనపై వచ్చే విమర్శల్లో వాస్తవాలు ఏ మేరకు ఉన్నాయి అనే విషయాన్ని అందరూ బేరీజు వేయాలి. వైకాపా, భాజపా, తెరాస లాలూచీ రాజకీయాలు చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాన్ని, తెదేపాను దెబ్బతీయడానికి.. తద్వారా 5 కోట్ల మంది ప్రజలకు అన్యాయం చేయాలనే దురుద్దేశంతో వారు ఉన్నారు’’ అని చంద్రబాబు ఆరోపించారు.
మాపై తెలంగాణ ప్రభుత్వ పెత్తనమేంటి?
‘‘డేటా వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి ఏం అధికారముంది? మా పార్టీ సమాచారాన్ని దొంగిలించి వైకాపాకు ఇస్తున్నారు. మాపై తెలంగాణ ప్రభుత్వ పెత్తనమేంటి? తెదేపా డేటా దొంగిలించి ప్రతిపక్షానికి ఇవ్వడమే కాకుండా ఏపీ ప్రభుత్వం డేటా లీకైందని దుష్ప్రచారం చేస్తున్నారు. ఎక్కడ లీకైంది? వైకాపా, తెరాస కలిసి ఈ విషయంలో చాలా దుర్మారంగా ప్రవర్తించాయి. ఓటు ఉందో లేదో ప్రజలు రోజూ చూసుకోవాలి. ఓటు లేని వారు ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 1050కి ఫోన్ చేసి ఓటు ఉందో లేదో తెలుసుకోండి. 15వ తేదీ వరకు ఓటు నమోదుకు అవకాశముంది. ఫారం-7 దుర్వినియోగం చేసిన వారిపై ఈసీ చర్యలు తీసుకోవాలి. దీనిపై రేపు దిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలుస్తున్నాం. 15వ తేదీ వరకు ఓటు విషయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి’’ అని చంద్రబాబు సూచించారు.
ఏపీలో తెలంగాణ వాళ్ల పాలన కావాలా?
‘‘ఇటీవల తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో ఆంధ్రా వాళ్ల పాలన కావాలా అని అడిగారు. అలాంటప్పుడు ఏపీలో తెలంగాణ పాలన కావాలా? ఏపీ ప్రజలు తెలివైన వాళ్లు. తెరాసకు ఊడిగం చేసే జగన్కు ఓటేయాలా? కులం, మతం, ప్రాంతాలను రెచ్చగొడుతున్నారు. ఎంతో కష్టపడి సంపద సృష్టించాం.. దాంతో సమకూరిన ఆదాయాన్ని పంపిణీ చేస్తున్నాం. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కేంద్రానికి కేసీఆర్ లేఖ రాయాలి. ఈ విషయంలో కేసీఆర్ను జగన్ ఒప్పించాలి’’ అని సీఎం అన్నారు.













